Polavaram : పోలవరం ప్రాజెక్టులో రీఎంబర్సు చేయాల్సిన మొత్తంపై రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. సాగునీటి కాంపోనెంట్ కింద చెల్లించాల్సింది రూ.1249 కోట్లు మాత్రమేనని కేంద్ర జలవనరుల శాఖ వెల్లడించింది. 2014 -2023 వరకూ రూ.13,463 కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంగా రీఎంబర్సు చేసినట్టు కేంద్రం తెలియచేసింది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం చేసిన వ్యయం- రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త రమేశ్ చంద్రవర్మ వివరాలు కోరారు. 2014 ఏప్రిల్ 1 నాటికి మిగిలి ఉన్న సాగునీటి కాంపోనెంట్ కు మాత్రమే 100 శాతం నిధులు రీఎంబర్సు చేస్తామని వెల్లడించినట్టు కేంద్రం స్పష్టం చేసింది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ నివేదిక ప్రకారం సాగునీటి కాంపోనెంట్ వ్యయం రూ.20,398.61 కోట్లుగా తేల్చింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించక ముందు రాష్ట్రం చేసిన వ్యయం రూ4730.71 కోట్లు ఉంటే.. కేంద్ర సాయంగా రీఎంబర్సు చేయాల్సిన మిగిలిన మొత్తం రూ. 15,667.90 కోట్లని కేంద్రం పేర్కోంది. ఇందులో 2023 మార్చి 31 తేదీ వరకూ రీఎంబర్సు చేసిన మొత్తం రూ.14,418.39 కోట్లుగా కేంద్ర జలవనరుల శాఖ తేల్చి చెప్పింది. ఇంకా రూ.1249 కోట్లు మాత్రమే ఇరిగేషన్ కాంపోనెంట్ గా రీఎంబర్సు చేయాల్సి ఉందని ఆర్టీఐ సమాధానంలో తెలియచేసింది. అయితే కేంద్రం నుంచి ఇంకా రూ.2,600 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది.
ఇవీ చదవండి :