Telangana High Court Hearing on Margadarsi: ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుక్‌ఔట్ సర్క్యులర్‌ను ఎలా జారీ చేశారని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. లుక్‌ఔట్ సర్క్యులర్ కఠిన చర్యల పరిధిలోకే వస్తుందన్నప్పుడు ఎలా జారీ చేశారని.. ఇది కోర్టు ధిక్కరణే కదా అని న్యాయస్థానం వాఖ్యానించింది. అఫిడవిట్ దాఖలు చేస్తామంటూ సీఐడీ అభ్యర్థించడంతో విచారణను డిసెంబరు 15కు వాయిదా వేసింది.
‘కఠిన చర్యలు చేపట్టరాదంటూ మార్చి 21న ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తూ.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా సీఐడీ అధికారులు లుక్‌ఔట్ సర్క్యులర్ ఇచ్చారు. సంస్థ ఆస్తుల్ని ఎటాచ్ చేశారు. దీనిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, సంస్థ ఎండీ సీహెచ్ శైలజ వేర్వేరుగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ కె.సురేందర్ మంగళవారం విచారించారు.
సుప్రీంలో మార్గదర్శికేసు - గాదిరెడ్డి యూరిరెడ్డికి చుక్కెదురు
మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాది వాసిరెడ్డి విమల్‌వర్మ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ధిక్కరణపై క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేస్తామని గత విచారణ సందర్భంగా సీఐడీ గడువు తీసుకుందన్నారు. ఎలాంటి అఫిడవిట్‌నూ దాఖలు చేయలేదన్నారు. ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది కైలాస్‌నాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. లుక్‌ఔట్ సర్క్యులర్‌ను ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో తెలుపుతూ కౌంటరు దాఖలు చేశామన్నారు.
న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అదే మీ సమాధానమైతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. కైలాస్‌నాథ్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మార్గదర్శి ఎండీ విదేశాలకు వెళ్లారని, ముందు జాగ్రత్తగా ఎల్వోసీ జారీ చేసినట్లు చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ముందు జాగ్రత్త అనేది ఎల్వోసీ జారీకి సరైన కారణం కాదన్నారు. కోర్టు ఉత్తర్వులు ఉండగా ఎల్వోసీ జారీ చేశారా.. లేదా? అని ప్రశ్నించారు.
అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందంటూ ఉత్తర్వులు జారీ చేయబోగా.. అఫిడవిట్ దాఖలుకు గడువు కావాలని, ఎల్వోసీ విషయంలో వివరాల్ని సమర్పిస్తామని కైలాస్‌నాథ్‌రెడ్డి తెలిపారు. దానిని మీ నిర్ణయానికే వదిలిపెడుతున్నామంటూ.. విచారణను డిసెంబరు 15కు న్యాయమూర్తి వాయిదా వేశారు. గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్, అదనపు ఎస్పీలు ఎస్.రాజశేఖర్‌రావు, సీహెచ్.రవికుమార్, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌గుప్త కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణకూ హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ సీఐడీ జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు