TDP Give More Seats to BCs in Lok Sabha Constituencies: లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈసారి వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే యోచనలో ఉంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు ఇచ్చేలా అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థులపై అధినేత చంద్రబాబు దాదాపుగా ఒక స్పష్టతకు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలను మార్చవచ్చని తెలుస్తోంది. జనసేనకు కేటాయించే లోక్‌సభ సీట్లు కోస్తా జిల్లాల్లోనే ఉండబోతున్నాయి.
విశాఖలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర - టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు తెలుగుదేశం ఎక్కువ కొత్త ముఖాల్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి ప్రస్తుత ఎంపీ రామ్మోహన్‌నాయుడు పోటీ చేసే అవకాశం ఉండగా, విజయనగరంలో సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు పోటీ చేయనంటే అక్కడ కూడా బీసీని రంగంలోకి దించే అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది. అనకాపల్లి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టిక్కెట్ దక్కవచ్చు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కూడా బీసీలకు ఒక టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది. గుంటూరు, నరసరావుపేట స్థానాల్లో ఎవరూ ఊహించని అభ్యర్థులు రంగంలోకి రాబోతున్నారు.
వైసీపీ పాలనలో అరాచకాలు - టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం : వరదరాజులు
నెల్లూరు, ఒంగోలు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులపై చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఆర్థికంగా బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు. రాయలసీమ జిల్లాల్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎప్పుడూ బీసీలకు ప్రాధాన్యమిచ్చే టీడీపీ గత ఎన్నికల్లో కొత్త ప్రయోగం చేసింది. మొత్తం 8 లోక్‌సభ స్థానాలకుగాను, రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాలుపోగా, బీసీలకు ఒక సీటే కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎప్పట్లానే పార్టీ విధానానికి తగ్గట్టుగా బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని అధిష్ఠానం భావిస్తోంది. ఎన్ని సీట్లు, ఏఏ స్థానాలు కేటాయిస్తారన్న విషయంలో నెలాఖరుకి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తిరువూరు సభను విజయవంతం చేయడమే లక్ష్యం - చంద్రబాబును సీఎం చేయడమే ధ్యేయం : కేశినేని
విజయవాడ లోక్‌సభ టిక్కెట్ ప్రస్తుత ఎంపీ కేశినేని నాని బదులు ఆయన సోదరుడు శివనాథ్‌కి ఇస్తున్నట్టుగా ఇప్పటికే సంకేతాలు పంపింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈనెల 7న జరగనున్న చంద్రబాబు సభకు ఏర్పాట్లు చేసే విషయంలో ఈనెల 3న నాని, చిన్ని వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అలాంటి ఘటనలు పార్టీకి మంచిది కాదన్న ఉద్దేశంతో వాటికి తెరదించేందుకు విజయవాడ లోక్‌సభ టిక్కెట్‌పై అధిష్ఠానం పరోక్షంగానైనా స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా కేశినేని చిన్నిని దాదాపుగా ఖరారు చేసినట్టేనని పార్టీ వర్గాల సమాచారం.
కేశినేని నాని చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒంగోలు, రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు సభలకు ఆయన హాజరుకాలేదు. లోకేశ్ యువగళం పాదయాత్రకూ ఆయన దూరంగా ఉన్నారు. అదే సమయంలో చిన్ని పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో యువగళం పాదయాత్ర సహా పార్టీ కార్యక్రమాల్ని విజయవంతం చేయడంలో చురుగ్గా పనిచేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత నాని మళ్లీ పార్టీలో కొంత క్రియాశీలంగా మారినట్టుగా కనిపించినా తాజా రాజకీయ పరిస్థితుల్ని, పార్టీ కేడర్ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం చిన్ని అభ్యర్థిత్వంపైనే మొగ్గు చూపింది.