Graduate MLC Elections Results: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో తెలుగుదేశం విజయకేతనం ఎగరవేయగా.. అధికార వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 9 ఉమ్మడి జిల్లాలు, 108 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎన్నికలు జరగ్గా.. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో 90శాతం తొలి ప్రాధాన్యంలోనే సాధించిన చిరంజీవిరావు.. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో దక్కించుకున్నారు. విజయానికి 94 వేల 509 కోటా ఓట్లు అవసరం కాగా.. మొదటి ప్రాధాన్యంలో చిరంజీవిరావుకు 82 వేల 958 ఓట్లు వచ్చాయి. విజయానికి ఇంకా 11 వేల 551 ఓట్లు కావాల్సి ఉండగా.. పోటీలో నిలిచిన 33మంది స్వతంత్రులు, బీజేపీ అభ్యర్థి మాధవ్‌కు వచ్చిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోనూ టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకే మెజారిటీ ఓట్లు దక్కాయి.
మూడో స్థానంలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు దక్కిన ఓట్లలో దాదాపు 18 వేలు లెక్కించే సమయానికే విజయానికి అవసరమైన కోటా ఓట్లు చిరంజీవిరావుకు దక్కడంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజయం ఖాయమైంది. టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు కావాల్సిన కోటా ఓట్లు 94,509 వచ్చే సమయానికి వైసీపీ అభ్యర్థి సుధాకర్‌కు 59 వేల 644 ఓట్లే వచ్చాయి. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు.. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. తొలి ప్రాధాన్య ఓట్లలో టీడీపీ అభ్యర్థికి 41.20 శాతంతో 82 వేల958 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 27.25 శాతంతో 55 వేల 749 ఓట్లు దక్కాయి. ఇద్దరి మధ్య 13.95శాతం వ్యత్యాసం కనిపించింది. సిటింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి మాధవ్ సహా 34 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఏడు రౌండ్లలో 2 లక్షల 69 వేల 339 ఓట్లు పోలవ్వగా ఇందులో 20 వేల 979 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2 లక్షల 48 వేల 360 ఓట్లు లెక్కించగా... రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్థి లక్షా 12 వేల 688 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డికి 85 వేల423 ఓట్లు వచ్చాయి. తూర్పు రాయలసీమ పరిధిలో అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని తొలి నుంచి విపక్షాలు విమర్శిస్తున్నాయి. భారీగా ఓట్లు చెల్లకపోవడం విపక్షాల విమర్శలకు బలాన్నిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి :