ఓ రెస్టారెంట్లో పరోటా తిని.. తల్లి, కూతురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో జరిగింది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లేదారిలోనే ఆ ఇద్దరూ మరణించారు.
అసలేం జరిగిందంటే?
తూత్తుకుడిలోని కోవిల్పట్టి తంగప్ప వీధికి చెందిన కర్పగం(33), ఆమె కుమార్తె దర్శిని అక్టోబరు 12న ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఆ ఇద్దరూ.. పరోటా ఆర్డర్ చేసి తిన్నారు. తర్వాత పక్కనే ఉన్న మరో దుకాణానికి వెళ్లి.. సాఫ్ట్ డ్రింక్ తాగారు. అనంతరం ఇంటికి వెళ్లారు. ఇంతవరకు బాగానే ఉన్నవారు.. ఒక్కసారిగా మూర్ఛపోయారు. అప్రమత్తమైన బంధవులు, స్థానికులు.. బాధితులిద్దరినీ కోవిల్‌పట్టిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చేతులెత్తేసిన వైద్యులు.. తిరునెల్వేలి పాలయన్కొట్టాయ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. అక్కడకు తీసుకెళ్తుండగా.. దారిలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోస్టుమార్టం కోసం తిరిగి కోవిల్పట్టి ఆస్పత్రికే తీసుకొచ్చారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కారు అద్దంలో మెడ ఇరుక్కొని బాలుడు మృతి