ఆస్కార్‌లో మెరిసిన 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' డాక్యుమెంటరీలో ఉన్న ఏనుగు సంరక్షకుల జంటను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సత్కరించారు. అలాగే ఏనుగుల సంరక్షకుల కోసం తమిళనాడు ప్రభుత్వం భారీగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ సాధించడం వల్ల అందులో నటించిన ఏనుగుల సంరక్షకులు జంట బొమ్మన్, బెల్లీ పాపులయ్యారు. రెండు అనాథ ఏనుగులను వారు సంరక్షించిన తీరును తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొనియాడారు. ఈ జంటను ప్రత్యేకంగా అభినందించారు. బొమ్మన్, బెల్లీలను సత్కరించిన ఆయన జ్ఞాపికలు అందజేశారు. వీరికి ఆర్థిక సహాయం చేశారు. ఏనుగుల సంరక్షణ కేంద్రాల్లో ఉన్న మవాటి వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ముదుమలై టైగర్ రిజర్వ్, అన్నామలై టైగర్ రిజర్వ్ ఈ రెండు శిబిరాల్లో ఉన్న మొత్తం 91 మంది ఏనుగుల సంరక్షకులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. మావటి వాళ్ల కోసం గృహాలను నిర్మించడానికి 9 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
"ది ఎలిఫెంట్ విస్పరర్స్" డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డును సాధించడం వల్ల దేశ విదేశీ పర్యాటకులు ముదుములై టైగర్ రిజర్వు బాటపట్టారు. ఒకవైపు పర్యాటకులు ఈ ఏనుగులను చూసేందుకు తరలివస్తుండటం వల్ల తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వీటికి అభివృద్ధికి నడుం బిగించింది. అన్నామలై టైగర్ రిజర్వ్‌లోని ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధికి చేయడానికి 5 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కోయంబత్తూరు చావడిలో 8 కోట్ల రూపాయలతో ప్రాథమిక సౌకర్యాలతో కొత్తగా మరో ఏనుగుల శిబిరాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించింది.
ఏనుగులకు పెరిగిన క్రేజ్
"ది ఎలిఫెంట్ విస్పరర్స్" డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డును సాధించడం వల్ల ముదుములై టైగర్ రిజర్వుకు దేశ, విదేశీ పర్యాటకులు తాకిడి ఎక్కువైంది. నీలగిరి జిల్లాలో ఉన్న ముదుమలై టైగర్ రిజర్వు ప్రాంతంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడుతుంది. ఏనుగులే కాకుండా అనేక వన్యప్రాణులకు ఈ ప్రాంతం నిలయం. టైగర్ రిజర్వులో భాగంగానే ఏనుగుల ఆహార కేంద్రాన్ని అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఆస్కార్ జ్యూరీ మనసులు గెలుచుకున్న గజరాజులే కాకుండా.. అనేక ఏనుగులు అక్కడ అధికారుల పర్యవేక్షణలో ఉన్నాయి. డాక్యుమెంటరీలో ఏనుగులను పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఫోటోలు తీస్తూ గజరాజుల చేష్టలను చూస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విదేశీయులు కూడా ఏనుగులను చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. డాక్యుమెంటరీలో కనిపించిన గిరిజన మహిళ బెల్లి పర్యటకుల కోరిక మేరకు.. ఏనుగులతో అక్కడ ఉండే జంతువులతో తమకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తున్నారు.
ఇవీ చదవండి: