పంజాబ్‌లోని మొహాలిలో అవాంఛనీయ ఘటన జరిగింది. ఆదివారం ఓ ఎగ్జిబిషన్ ఫెయిర్‌లో అనూహ్య ప్రమాదం జరిగింది. సందర్శకులను గాలిలో పైనుంచి కిందకు తిప్పే స్వింగ్ విరిగి కుప్పకూలిపోయింది. ఈ సమయంలో స్వింగ్‌పై సుమారు 50 మంది కూర్చున్నారు. 50 అడుగుల ఎత్తు నుంచి అది కింద పడటం వల్ల.. పలువురికి గాయాలయ్యాయి. కొందరు చిన్నారులు వెంటనే స్పృహ తప్పి పడిపోయారు. అక్కడే ఉన్న కొంతమంది వేగంగా స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సాంకేతిక సమస్యతో స్వింగ్ పడిపోయినట్లు తెలుస్తోంది.
మొహాలిలోని దసరా గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ఫెయిర్ నిర్వహణకు సెప్టెంబర్ 4 వరకు అనుమతి ఉందని అధికారులు తెలిపారు. అయితే ఫెయిర్ ప్రవేశద్వారం వద్ద 'సెప్టెంబర్ 11 వరకు గడవు పొడగించి'నట్లు రాసి ఉన్న బోర్డు ఉందని చెప్పారు. 'నిర్వాహకులకు ఈ షో జరిపేందుకు అనుమతులు ఉన్నాయని ప్రాథమికంగా తెలిసింది. అయితే, ఈ ప్రమాదం ఎవరి తప్పు వల్ల జరిగిందో అని తెలుసుకునే పనిలో ఉన్నాం. ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. క్షతగాత్రులందరినీ సివిల్ ఆస్పత్రిలో చేర్పించాం' అని డీఎస్పీ హర్సిమ్రన్ సింగ్ బల్ తెలిపారు.
నిర్వాహకుల నిర్లక్ష్యం
ఫెయిర్‌లో గాయపడ్డ వారిలో ఐదుగురు తమ ఆస్పత్రిలో చేరారని సివిల్ హాస్పిటల్ వైద్యుడు సుభాష్ తెలిపారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. కాగా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఘటన జరిగిన తర్వాత నిర్వాహకులు ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు.
'నిర్వాహకులు నియమించుకున్న ప్రైవేటు బౌన్సర్లు 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. వీరికి ఓ మహిళ నేతృత్వం వహిస్తోంది. ఎవరూ చనిపోలేదు కదా అంటూ ఆమె మాట్లాడింది. అసలు ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎలాంటి మెడికల్ కిట్లు లేకుండానే ఫెయిర్ నిర్వహిస్తున్నారు. సుమారు 50 మంది గాయపడ్డారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. పెద్ద అధికారులు కూడా ఇక్కడికి రాలేదు' అని స్థానికులు ఆరోపించారు.