విచారణ నిమిత్తం దేశ రాజధానిలోని తిహార్ జైలులో(Tihar Jail) పెడితే అక్కడ నుంచే నిందితులు వ్యవహారాలన్నీ చక్కబెట్టుకున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సుప్రీంకోర్టు(Supreme Court) దృష్టికి తీసుకువచ్చింది. ఇళ్ల కొనుగోలుదార్లను మోసగించారన్న ఆరోపణపై అరెస్టయిన యునిటెక్(unitech supreme court) సంస్థ వ్యవస్థాపకుడు రమేష్ చంద్ర దక్షిణ దిల్లీలో రహస్యంగా భూగర్భ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని న్యాయమూర్తులు జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం దృష్టికి అదనపు సొలిసిటర్ జనరల్ మాధవీ దివాన్ తీసుకువచ్చారు. దీనిపై ఈడీ రెండు నివేదికలు సమర్పించింది.
ఈ కేసులోనే(unitech case) అరెస్టయిన రమేష్ చంద్ర కుమారులు, ఆ సంస్థ మాజీ డైరెక్టర్లు అయిన సంజయ్ చంద్ర, అజయ్ చంద్రలు కూడా ఇదే జైలులో ఉన్నారు. పెరోల్‌పై విడుదలయినప్పుడు వారు ఆ కార్యాలయాన్ని సందర్శించారు. 'రహస్య కార్యాలయాన్ని సోదాలు చేసినప్పుడు అక్కడ వందలాది ఒరిజినల్ అమ్మకం పత్రాలు దొరికాయి. వందలకొద్దీ డిజిటల్ సంతకాలు కూడా ఉన్నాయి. దేశవిదేశాల్లోని ఆస్తుల సమాచారం ఉన్న కంప్యూటర్లు ఉన్నాయి. జైలు బయట సంస్థ సిబ్బందిని ఉంచి నిందితులు వారికి ఆదేశాలు ఇస్తున్నారు' అని ఈడీ తన నివేదికలో పేర్కొంది. ఈ సమయంలో రమేష్ చంద్ర తరఫు న్యాయవాది వికాస్ సింగ్ జోక్యం చేసుకొని జైలు నిబంధనలకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తాము ప్రస్తుతం దర్యాప్తు సంస్థ చెప్పేది వింటున్నామని, నిందితుల తరఫు వాదనలు కాదని తెలిపింది.
జైలు అధికారులపై దర్యాప్తు
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తిహార్ జైలు సిబ్బంది(Tihar Jail officials) సాయంతోనే ఇలా చేయగలిగారని భావించిన ధర్మాసనం సంజయ్ చంద్ర, అజయ్ చంద్రలను ముంబయిలోని అర్ధర్ రోడ్, తాలోగా జైళ్లల్లో విడివిడిగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. జైలు సిబ్బంది తీరుపై స్వయంగా దర్యాప్తు జరిపి, నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని దిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం జైలు అధికారులపై కఠినమైన వ్యాఖ్యలు చేసింది. 'కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడానికి జైలు అధికారులతో కుమ్మక్కయ్యారు. తిహార్ జైలు సూపరెంటెండెంట్, ఆయన సిబ్బందికి ఏ మాత్రం సిగ్గులేదు. దేశ రాజధానిలో ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా? తిహార్ జైలు అధికారులపై నమ్మకాన్ని కోల్పోయాం. రాజధానిలో కూర్చొని వారు మా ఆదేశాలను విఫలం చేస్తున్నారు. వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం' అని వ్యాఖ్యానించింది.
74 ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులు చేపడతామని చెప్పి యునిటెక్ సంస్థ 2006-2014 మధ్య 29,800 మంది కొనుగోలుదార్ల నుంచి రూ.14,270 కోట్లు, ఆరు ఆర్థిక సంస్థల నుంచి రూ.1805 కోట్లు సేకరించినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలింది. దీంట్లో కొంత దుర్వినియోగమయినట్టు తేలడంతో రూ.750 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ సంస్థ డైరెక్టర్లను తొలగించి, రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో కొత్త బోర్డు ఏర్పాటు చేసింది. కోర్టు సూచనల మేరకు మొత్తం నగదును డిపాజిట్ చేసినందున తమకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని నిందితులు కోరారు. 2017 నుంచి వారు జైలులో ఉన్నారు.
ఇదీ చూడండి: సర్కారు మారితే రాజద్రోహం కేసులా!