భారతీయులు, పశ్చిమ దేశీయుల పేగుల్లోని సూక్ష్మజీవులు (Indian gut microbiome) భిన్నంగా ఉంటున్నట్టు తాజా పరిశోధన విశ్లేషించింది. ఆహార అలవాట్లలో వైవిధ్యమే ఇందుకు కారణమని తేల్చింది. భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్), అమెరికాలోని సౌత్ డకోటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు.
మనిషి పేగుల్లో 300 నుంచి 500 రకాల మేలుకర (Gut microbiota composition) సూక్ష్మజీవులు (గట్ బ్యాక్టీరియా) ఉంటాయి. మనిషి మనుగడకు ఇవి అత్యంత అవసరం. జీర్ణక్రియకు తోడ్పడతాయి. విటమిన్లు, నాడీ రసాయనాల ఉత్పత్తికి దోహదపడతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇక్కడే మరో చిక్కుంది. పశ్చిమ దేశీయుల పేగు బ్యాక్టీరియాను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఔషధాలనే.. భారత్ తదితర దేశాలకు చెందిన ప్రజలు వినియోగించాల్సి వస్తోంది. దీంతో ఔషధాల పనితీరు భిన్నంగా ఉంటోంది. దీనిపై దృష్టి సారించిన ఐఐఎస్‌ఈఆర్ శాస్త్రవేత్తలు.. మధ్యప్రదేశ్, దిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, బిహార్, కేరళ తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి సుమారు 200 రకాల పేగు బ్యాక్టీరియాను విశ్లేషించారు. "పశ్చిమ దేశాల్లోని ఆహారంతో పోల్చితే భారతీయులు తీసుకునే ఆహారంలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. భారతీయుల్లో 'ప్రివోటెల్లా జెనస్' అనే గట్ బ్యాక్టీరియా అధికంగా ఉంటే, పశ్చిమ దేశాలవారిలో బాక్టిరోయిడెస్ రకం ఎక్కువగా ఉంటోంది. పేగు సూక్ష్మజీవులకు అనుగుణంగా ఔషధాలను రూపొందించేందుకు మా పరిశోధన తోడ్పడుతుంది. తద్వారా స్వస్థత మరింత త్వరగా, మెరుగ్గా చేకూరే అవకాశం ఉంటుంది" అని పరిశోధనకర్త వినీత్ శర్మ వివరించారు.
ఇదీ చదవండి: వైద్య రంగంలో విస్తరిస్తున్న పరిశోధనలు