- ప్రశ్న: ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలులో అసలేం జరిగింది? ప్రభుత్వం, సీమెన్స్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందా?
సుమన్ బోస్: ప్రభుత్వానికి, సీమెన్స్ సంస్థకు మధ్య ఒప్పందం జరిగింది. దానికంటే ముందు అప్పటి ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా చాలా పరిశోధనలు చేశాం. ప్రభుత్వ ప్రతిపాదనలు, పారిశ్రామిక విధానాలకు తగినట్లుగా చాలా సంప్రదింపులు చేశాం. అంతిమ ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. దీన్ని ఏపీ ప్రభుత్వం, సీమెన్స్ సంస్థల న్యాయవిభాగాలు ఆమోదించాయి. తర్వాత ప్రాజెక్టు వాల్యూయేషన్‌కు సంబంధంచి డిజైన్‌టెక్ సంస్థతో థర్డ్‌పార్టీ ఒప్పందం కుదిరింది. ఇది కేంద్ర సంస్థ అయిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రాజెక్టును రాష్ట్రంలోని 40 కేంద్రాల్లో అమలుచేశాం. 2021 నుంచి ఆ కేంద్రాలను ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ మొదలైంది. ఒక్కొక్కటిగా 40 కేంద్రాలను అప్పగించేశాం. ప్రతి కేంద్రానికి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఉన్నతాధికారి, సెంటర్ హెడ్‌గా ఉన్న కళాశాల ప్రిన్సిపల్ సంతకాలతో కూడిన స్టాక్ రిజిస్టర్లు, బుక్‌లెట్ అందజేశాం. ప్రాజెక్టు, ల్యాబ్‌లకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఇది ఒక విజయవంతమైన ప్రాజెక్టు అని కేపీఎంజీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. 2.13 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రాజెక్టు ద్వారా శిక్షణ పొందారు. ఇవన్నీ కంటికి కనిపిస్తున్న వాస్తవాలు.
ప్రశ్న: ఈ ప్రాజెక్టులో రూ.317 కోట్ల అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇందులో సీమెన్స్ సంస్థతో పాటు మిగతా సంస్థల పాత్ర ఏంటి?
సుమన్ బోస్: ఇది మూడు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం. ఇందులో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఓ ప్రభుత్వ సంస్థ. సీమెన్స్ సంస్థ సాంకేతిక భాగస్వామి. కావాల్సిన ఫలితాలను రాబట్టే విధంగా ప్రాజెక్టును రూపకల్పన, అభివృద్ధి చేసింది సీమెన్స్ సంస్థ. శిక్షణ పొందిన విద్యార్థులకు ఇచ్చే ధ్రువపత్రాలపైనా సీమెన్స్ సంస్థ లోగో ఉంటుంది. సీమెన్స్ సంస్థ ప్రమాణాలతో శిక్షణ ఇచ్చినట్లు ఆ ధ్రువపత్రాలపై సంస్థ లోగోను ముద్రించాం. డిజైన్‌టెక్ సంస్థ ఓ సిస్టమ్ ఇంటిగ్రేటర్. ప్రాజెక్టును అమలు చేసే బాధ్యత ఆ సంస్థది. ప్రాజెక్టు అమలులో భాగంగా డిజైన్‌టెక్ సంస్థ మరికొన్ని కంపెనీలను నియమించుకుంది. ఇది ఉప కాంట్రాక్టు విధానం కాదు. వారంతా విక్రేతలు. ఇంత పెద్ద ప్రాజెక్టును అమలు చేయాలంటే ఇలాంటి చాలా మంది విక్రేతలను తీసుకోవాల్సి ఉంటుంది.
- ప్రశ్న: సీఐడీ 2021 నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ కేసును విచారిస్తోంది. ఇందులో అవినీతి జరిగింది. డొల్ల కంపెనీలున్నాయి వంటి ఎన్నో ఆరోపణలు చేస్తోంది. దీనిపై మీ స్పందనేంటి?
సుమన్ బోస్: అవన్నీ ఒట్టి ఆరోపణలే. రుజువులు ఉంటేనే దేన్నైనా నమ్మగలం. ఆధారాలు ఉంటే వారు చూపాలి. దీనికి సంబంధించిన పత్రాలు న్యాయస్థానంలో ఉన్నాయి. అంతిమ నిర్ణయం కోర్టులదే.
- ప్రశ్న: ఒప్పందం ప్రకారం.. సీమెన్స్ సంస్థ గ్రాంటు రూపంలో పెట్టుబడులు పెడతామని ఉంది. ఈ ప్రాజెక్టు ఖర్చుల వివరాలేంటి?
సుమన్ బోస్: సీమెన్స్ సంస్థతో పాటు దాని భాగస్వాములంతా కలిసి ఈ ప్రాజెక్టు ఖర్చులో 90 శాతం పెట్టుబడి పెట్టాయి. ఇది కూడా డిస్కౌంట్ల రూపంలో ఇచ్చాం. మిగతా 10 శాతం ప్రభుత్వం నుంచి అందింది.
MLA Rajasingh React on Chandrababu Naidu Arrest : చంద్రబాబును చూస్తే జగన్ భయపడుతున్నారు: రాజాసింగ్
ప్రశ్న: ప్రభుత్వం జీవోలో పేర్కొన్న లెక్కల వివరాలు, అంచనా ఖర్చుల వివరాల్లో తేడాలున్నాయన్నది సీఐడీ వాదన. దీనిపై మీరేమంటారు?
సుమన్ బోస్: ఓ ప్రైవేటు పార్టీగా జీవోల్లో ఉన్న అంశాలపై మాకు అవగాహన ఉండదు. మా మధ్య జరిగిన ఒప్పందాలు, మెసేజ్‌లు, ఈ-మెయిల్‌ల గురించి మాత్రమే మాట్లాడగలం. ప్రాజెక్టులో పెట్టిన పెట్టుబడి అంతా గ్రాంటు మాత్రమే. ఇందులో నగదు ప్రవాహం ఉండదు. సీమెన్స్ సంస్థ అలాంటి ప్రాజెక్టులు చేపట్టదు కూడా. మా వైపు నుంచి అంతా సవ్యంగానే నడిచింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని మేము పాటించాం. ఏపీలోనూ అదే చేశాం.
- ప్రశ్న: గుజరాత్, ఏపీతోపాటు ఎన్ని రాష్ట్రాల్లో సీమెన్స్ సంస్థ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇవన్నీ సీమెన్స్ సంస్థ హెడ్‌క్వార్టర్స్ అనుమతి, ఆమోదం పొందినవేనా?
సుమన్‌బోస్: సీమెన్సే కాదు, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఏ బహుళ జాతీయ సంస్థ అయినా ఇలాంటి ప్రాజెక్టులను.. సంస్థ అనుమతి లేకుండా చేపట్టలేదు. ఎవరైనా సంస్థకు ఒక్క రూపాయి విలువైన ఆర్డర్ ఇచ్చినా.. దాన్ని రెవెన్యూ విధానంలో బుక్ చేసే ప్రక్రియ ఉంటుంది.
Rajinikanth's comments on CBN Mulakat : చంద్రబాబుతో ములాఖత్.. తమిళ్ తలైవా రజనీకాంత్ స్పందన ఇది..
ప్రశ్న: ఈ ప్రాజెక్టు విషయంలో సుమన్ బోస్ తమ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెప్పాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఇది సీమెన్స్ ఇండియా రిపోర్టులో కూడా ఉంది. మీరేమంటారు?
సుమన్ బోస్: అవన్నీ నిరాధార ఆరోపణలు. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. ఇది తప్పు అని నిరూపించేందుకు కావాల్సిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. సీమెన్స్ సంస్థకు ఈ విషయం తెలుసా తెలియదా అన్న దాని గురించి.. ఆ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రెస్ ప్రకటనలు చూస్తే సరిపోతుంది. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టు విషయంలోనూ అనేక ప్రకటనలు వచ్చాయి. ఒకవేళ ఇవన్నీ తప్పుడు ప్రకటనలే అయితే సీమెన్స్ సంస్థ ఎందుకు ఖండించలేదు. ఈ ప్రాజెక్టు అమలవుతున్నసమయంలో ఎప్పుడైనా ఏపీఎస్‌ఎస్‌డీసీ దేని గురించైనా ఫిర్యాదు చేసిందా? ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. ప్రాజెక్టు అప్పగించిన తర్వాత ఒక పక్క ప్రశంసిస్తూనే మరోవైపు ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంత వరకు న్యాయం?
- ప్రశ్న: సీమెన్స్ సంస్థ అనేక రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టింది. అనేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరి కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే ఎందుకు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు?
సుమన్ బోస్: ఈ ఆరోపణల వల్ల నేనే కాకుండా నాతో పాటు పనిచేసిన నా మాజీ సహచరులు, వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కానీ మేము చాలా గొప్పగా ప్రాజెక్టును విజయవంతం చేశాం. ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి వచ్చిన ప్రశంసాపత్రంలోనూ వారు ఇదే విషయాన్ని పేర్కొన్నారు.