తమిళనాడుకు చెందిన రామసుందరం అలియాస్ పూంగుండ్రన్ తన భార్య రాధాబాయితో కలిసి చాలా ఏళ్ల కిందట మలేసియా వెళ్లారు. అక్కడ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ 1967లో మరణించారు. అప్పటికే రాధాబాయి గర్భిణి. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని, భర్తకు అంత్యక్రియలు చేయించి, అక్కడే సమాధిని కట్టించారామె. పదేపదే భర్త జ్ఞాపకాలు చుట్టుముడుతుంటే బాధను తట్టుకోలేక తమిళనాడు వచ్చేశారు. 6 నెలల తర్వాత ఆమెకు తిరుమారన్ జన్మించారు. 35 ఏళ్ల క్రితం రాధాబాయి మరణించారు.
తిరుమారన్‌కు ఇప్పుడు 56 ఏళ్లు. ప్రస్తుతం తెన్కాశి జిల్లా వేంకటాంపట్టిలో ఉంటూ సమాజ సేవ చేస్తున్నారు. తండ్రిని చూడకున్నా.. కనీసం ఆయన సమాధినైనా దర్శించుకోవాలనే కోరిక ఆయనలో బలంగా నాటుకుంది. బతికున్నప్పుడు తల్లి చెప్పిన వివరాల ఆధారంగా మలేసియాలో తండ్రి నివసించిన ప్రాంతం, పని చేసిన పాఠశాలను గూగుల్ ద్వారా అన్వేషించారు.
పాఠశాల ఇ-మెయిల్ చిరునామా తెలియడంతో తన తండ్రి వివరాలు తెలుపుతూ... ఆయన సమాధిని కనుగొనేందుకు సాయపడాలని సందేశం పంపారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందించారు. రామసుందరం గురించి వివరాలు తెలిసిన మోహనరావు, పూనాట్చి అలియాస్ నాగప్పన్‌లను గుర్తించారు. వారంతా కలిసి రామసుందరం సమాధి ఉన్న చోటును కనుగొన్నారు. ఈ నెల 8న తిరుమారన్ మలేసియా వెళ్లారు. ఇప్పటికీ పదిలంగా ఉన్న తండ్రి సమాధిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
తమిళుల సంస్కృతికి ప్రతీక
తిరుమారన్ ప్రయత్నం గురించి తెలిసి చలించిపోయానని తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు. తండ్రిపై కుమారుడికి ఉన్న ప్రేమతోపాటు సముద్రం దాటి మలేసియాలో జీవిస్తున్న తమిళుల సంస్కృతిని ఈ ఉదంతం ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.