Supreme Court Comments On Talaq: తలాక్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తలాక్- ఈ- హసన్, ముమ్మారు తలాక్ రెండూ వేర్వేరు అని స్పష్టం చేసింది. తలాక్-ఇ-హసన్ చట్టవిరుద్ధమని ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. 'ఖులా' ద్వారా ముస్లిం మహిళలు సైతం తమ భర్తలకు విడాకులు ఇచ్చేందుకు అవకాశం ఉందన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఒకవేళ భార్యాభర్తలిద్దరికీ కలిసి ఉండటం ఇష్టం లేకపోతే.. కోర్టులు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు మంజూరు చేస్తాయని వివరించింది.
బెనజీర్ హీనా అనే మహిళ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తాను తలాక్-ఈ-హసన్ బాధితురాలని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ పింకీ ఆనంద్.. ముమ్మారు తలాక్‌ను రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు గతంలో తేల్చిందని గుర్తు చేశారు. అయితే, తలాక్- ఈ- హసన్ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పౌరులందరికీ ఒకే విధంగా విడాకులు మంజూరు చేసేలా ఉమ్మడి విధివిధానాలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. అయితే, పిటిషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.
'ఇది వేరే ఇతర అంశాలకు అజెండాగా మారాలని అనుకోవడం లేదు. ముమ్మారు తలాక్, తలాక్-ఈ- హసన్.. రెండూ ఒకటి కాదు. వివాహాలు ఒప్పందం ప్రకారం నడుస్తాయి. మీకు (పిటిషనర్‌ను ఉద్దేశించి) ఖులా అవకాశం కూడా ఉంది. దంపతులు కలిసి జీవించలేకపోతే విడాకులు మంజూరు చేసేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. మెహర్ (వధువుకు వరుడు ఇచ్చే కానుకలు) తిరిగి చెల్లించేందుకు అంగీకరిస్తే విడాకులు మంజూరు చేస్తాం. అందుకు మీరు సిద్ధమేనా?' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 28కు వాయిదా వేసింది.
ఖులా, తలాక్-ఇ-హసన్ అంటే?
నెలకోసారి చొప్పున వరుసగా మూడు నెలలు తలాక్ చెప్పి ఓ ముస్లిం.. తన భార్య నుంచి విడాకులు పొందడాన్ని తలాక్-ఇ-హసన్‌గా వ్యవహరిస్తారు. కాగా, భర్త నుంచి భార్య విడాకులు పొందే ప్రక్రియను ఖులా అంటారు. అయితే, వివాహ సమయంలో భర్త నుంచి పొందిన కానుకలు, నగదును తిరిగి ఇవ్వడం, ఇవ్వకపోవడం పూర్తిగా మహిళ ఇష్టం.
ఇవీ చదవండి:
ప్రాక్టీస్ సెషన్లో పల్టీలు కొట్టిన కబడ్డీ ప్లేయర్, తలకు తీవ్ర గాయంతో మృతి