మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన.. ప్రముఖ నటుడు, నిర్మాత సచిన్ జోషికి(Sachin Joshi) సుప్రీంకోర్టు మంగళవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ముంబయికి చెందిన 'ఓంకార్ రియల్టర్స్' అనే సంస్థ నుంచి రూ.100 కోట్ల అక్రమ నగదు చలామణి కేసులో ఆయనను గతంలో ఈడీ అరెస్టు చేసింది. అయితే.. వైద్య చికిత్స కోసం తనకు శాశ్వత బెయిల్ కావాలని కోరుతూ సచిన్ జోషి(Sachin Joshi) సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
వెన్నెముక శస్త్రచికిత్స నేపథ్యంలో తరుచూ సచిన్ జోషికి వైద్యం అందించాల్సి ఉంటుందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టుకు వివరించారు. ఈ కారణంగా సచిన్ జోషికి పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. సంబంధిత మెడికల్ రికార్డులను సమర్పించారు.
'బెయిల్‌కు అర్హుడు కాదు'
అయితే.. ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. సచిన్ జోషికి(Sachin Joshi) అందే వైద్య చికిత్సలు స్వల్పమైనవేని కోర్టుకు నివేదించారు. ఆయన బెయిల్‌కు అర్హుడు కాదని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. సచిన్ జోషికి నాలుగు నెలలు పాటు.. తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఈ గడువును మరింత కాలంపాటు పొడిగించబోమని స్పష్టం చేసింది.
సచిన్ జోషికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని బాంబే హైకోర్టును మే నెలలో ఈడీ ఆశ్రయించింది. అయితే.. సచిన్ జోషి ఆ సమయంలో కొవిడ్‌తో బాధపడుతున్నందున రెండు నెలలపాటు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రెండు నెలల తర్వాత స్వచ్ఛందంగా ఈడీ వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాత్కాలిక బెయిల్ ముంజూరు చేసింది న్యాయస్థానం.
మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్లమ్ రీహాబిలిటేషన్ అథారిటీ పథక పనుల్లో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఇదీచూడండి: నటుడు సచిన్ జోషి అరెస్టు!