Salary Negotiation Tips : జాబ్ ఇంటర్వ్యూలో అన్నింటికంటే చాలా కష్టమైన ప్రశ్న.. 'మీరు ఎంత జీతం ఆశిస్తున్నారు?'. ఈ ప్రశ్న అడగగానే చాలా మంది ఒక్కసారిగా డైలమాలో పడిపోతూ ఉంటారు. తమ విద్యార్హతలకు, సదరు ఉద్యోగ బాధ్యతలకు అనుగుణంగా ఎంత శాలరీ డిమాండ్ చేయాలో తెలియక తికమక పడిపోతూ ఉంటారు. ఫ్రెషర్స్ మాత్రమే కాదు.. ఉద్యోగ అనుభవం ఉన్నవారు కూడా సరైన శాలరీని అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే ఇది మీ కోసమే.
మీ వర్త్‌ను అనుసరించి.. శాలరీ వస్తుంది!
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టినవారు.. తమకు ఉన్న స్కిల్స్‌ను ఎలా ప్రెజెంట్ చేయాలో తెలియక ఇబ్బంది పడతారు. అప్పటికే ఉద్యోగ అనుభవం ఉన్నవారు సైతం.. తమకున్న స్కిల్స్‌కు, ఎక్స్‌పీరియన్స్‌కు అనుగుణంగా.. బెస్ట్ ప్యాకేజ్ అడగడానికి మొహమాటపడుతూ ఉంటారు. దీని వల్ల తమ వర్త్‌కు సరిపడే శాలరీలు రావు. ఫలితంగా చాలా తక్కువ జీతంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మీకు కూడా ఇలాంటి సమస్యే ఉంటే.. ఈ ఆర్టికల్‌లో తెలిపిన టిప్స్ పాటించండి.
మీరు ఎంత జీతం ఆశిస్తున్నారు?
ఇంటర్వ్యూలో మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనుకోండి.. వెంటనే 'మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?' అని అడుగుతారు. ఈ ప్రశ్న అడగగానే చాలా మందికి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇలాంటి సమస్య ఏర్పడకుండా ఉండాలంటే ముందుగానే.. అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి. సాధారణంగా హైరింగ్ మేనేజర్లు లేదా రిక్రూటర్లు.. సదరు ఉద్యోగానికి సరిపడే స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులను ఎంచుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తారు. అదే సమయంలో తమ కంపెనీ బడ్జెట్‌కు అనుగుణంగా శాలరీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తించుకోవాలి.
రియలిస్టిక్‌గా ఉండాలి!
మీరు ఉద్యోగానికి అప్లై చేసినప్పుడే.. ముందస్తు రీసెర్చ్ ప్రారంభించాలి. ముఖ్యంగా మీకు ఉన్న స్కిల్స్‌కు ఎంత మేరకు జీతం డిమాండ్ చేయవచ్చో ఒక అంచనాకు రావాలి. ఒక వేళ ఇప్పటికే మీకు పూర్వ ఉద్యోగ అనుభవం ఉంటే.. ఆ అనుభవాన్ని ఎంత మేరకు క్యాష్ చేసుకోవచ్చో తెలుసుకోవాలి. మీ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో.. మీరే స్వయంగా లెక్కించుకోవాలి. ఇక్కడ మీరు కచ్చితంగా గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే.. మీ అంచనాలు వాస్తవికంగా ఉండాలి. లేకపోతే వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మీ శక్తి, సామర్థ్యాలకు మించి జీతం అడిగితే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది.
మీ వర్త్ ఎంతో ఎలా తెలుసుకోవాలి?
How To Know Your Salary Worth : ముందుగా మీ వర్త్ గురించి మీరే ఒక కచ్చితమైన అంచనాకు రావాలి. ఇందుకోసం ముందుగా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ , కంపెనీ కాంపెన్సేషన్ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకోవాలి.
- ఆన్లైన్ రీసెర్చ్ : ప్రస్తుతం salary.com, Glassdoor, Payscale లాంటి అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఉద్యోగాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు గురించిన సమాచారం ఉంటుంది. అదే విధంగా సదరు ఉద్యోగాలకు ఇచ్చే మినిమం-టు-మాగ్జిమమ్ శాలరీస్ వివరాలు కూడా ఉంటాయి.
- శాలరీ రేంజ్ మారుతూ ఉంటుంది : ఒక పర్టిక్యులర్ జాబ్, ఆ జాబ్ లొకేషన్, సదరు ఉద్యోగానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్, స్కిల్స్.. మొదలైన వాటి ఆధారంగానూ జీతాల రేంజ్ మారుతూ ఉంటుంది. ఈ వివరాలు కూడా ఆన్లైన్లో లభిస్తాయి.
- అనుభవజ్ఞులను అడగడం మంచిది : ఇండస్ట్రీలో లేదా కంపెనీలో పనిచేస్తున్న, అనుభవజ్ఞులైన ఉద్యోగులను అడిగి.. అక్కడ ఇచ్చే జీతభత్యాల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే జీతభత్యాలను ఎలా బేరం చేయాలో కూడా వారిని అడిగి తెలుసుకోవచ్చు.
- శాలరీ సర్వే : ఒక్కో ఇండస్ట్రీలో.. ఒక్కో రకంగా జీతభత్యాలు ఉంటాయి. కనుక ఆయా రంగాల్లో ఇచ్చే శాలరీల గురించి ప్రత్యేకంగా సర్వే చేయాలి.
- కంపెనీలు ఇచ్చే జీతభత్యాలను బేరీజు వేయాలి : ఒకే రంగంలో వివిధ కంపెనీలు ఉంటాయి. ఒక కంపెనీ ఎక్కువ జీతాలు ఇస్తే.. మరో కంపెనీ తక్కువ జీతాలు ఇస్తూ ఉంటుంది. కనుక ఒకే జాబ్ పోజిషన్‌కు వివిధ కంపెనీలు ఇచ్చే జీతభత్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. LinkedIn లాంటి వెబ్సైట్లు ద్వారా వివిధ కంపెనీలు ఇచ్చే జీతభత్యాల వివరాలు తెలుసుకోవచ్చు.
- కాస్ట్ ఆఫ్ లివింగ్ : ఉద్యోగం చేసే ప్రాంతాన్ని అనుసరించి.. కాస్ట్ ఆఫ్ లింగ్ మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఒక సాధారణ పట్టణంలో జాబ్ చేస్తే.. జీవన ఖర్చులు తక్కువగా ఉంటాయి. అదే మెట్రో నగరాల్లో ఉద్యోగం చేస్తుంటే.. అక్కడ జీవన ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. కనుక జాబ్ లొకేషన్‌ను అనుసరించి కూడా శాలరీ నెగోషియేషన్ చేయాల్సి ఉంటుంది. పైన చెప్పిన వాటన్నింటినీ ఇంటర్వ్యూ కంటే ముందే రీసెర్చ్ చేసుకుని.. సిద్ధంగా ఉండాలి.
ఇంటర్వ్యూలో స్మార్ట్‌గా వ్యవహరించాలి!
How To Negotiate A Salary In An Interview :
- ఇంటర్వ్యూ జరిగే గదిలోకి అడుగుపెట్టగానే.. అందరికీ నమష్కారం చేయండి. చిరునవ్వుతో ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. జీతం గురించి డిస్కషన్ చేద్దామా? అని అడగగానే.. కాన్ఫిడెంట్‌గా 'తప్పకుండా డిస్కషన్ చేద్దాం' అని చెప్పండి.
- 'మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?' అని అడిగితే.. ముందుగా మీరు ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారో చెప్పండి? అని తిరిగి అడగండి. ఇందులో ఎలాంటి మొహమాటానికి తావులేదు. ముఖ్యంగా కంపెనీలో.. మీ పొజిషన్, రెస్పాన్స్‌బిలిటీస్ (బాధ్యతలు), కంపెనీ ఇచ్చే ప్యాకేజ్, పెర్క్స్, గ్రోత్ ఆపర్చూనిటీస్ సహా అన్ని వివరాలు కచ్చితంగా అడిగి తెలుసుకోండి. వాటికి అనుగుణంగా మీకు ఎంత శాలరీ కావాలో స్పష్టంగా అడగండి.
- ఒక వేళ ఇంటర్వ్యూ చేసేవారు లేదా రిక్రూటర్లు.. మిమ్మల్నే ముందుగా శాలరీ గురించి కచ్చితంగా చెప్పమంటే.. అప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీకున్న విద్యార్హతలు, నైపుణ్యాలు, పని అనుభవం, ఉద్యోగ బాధ్యతలు, మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి.. మీ వర్త్‌కు అనుగుణంగా జీతం ఇవ్వమని అడగండి. లేదా మీ శాలరీ రేంజ్ గురించి చెప్పండి. ఉదాహరణకు నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 రేంజ్లో శాలరీ ఇవ్వండి అని అడగవచ్చు.
నోట్ : మీరు శాలరీ విషయంలో ఒక కచ్చితమైన నంబర్‌ను చెబితే.. అది మీపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే.. కంపెనీ రిక్రూటర్ల మనస్సులో మీకు ఎక్కువ శాలరీ ఇవ్వాలని ఉంటుంది. కానీ మీరు తక్కువ శాలరీ కోట్ చేశారనుకోండి. దాని వల్ల అనవసరంగా మీ శాలరీ తగ్గిపోతుంది. ఒక వేళ మీరు మీ సామర్థ్యానికి మించి శాలరీ అడిగారనుకోండి. ఉద్యోగానికి ఎంపిక చేసే అవకాశం తగ్గుతుంది. కనుక ఎప్పుడూ శాలరీ రేంజ్‌ను చెప్పడమే మంచిది.
ఫ్లెక్సిబుల్‌గా ఉండడం మంచిది!
How To Negotiate Salary With Employer : జీతభత్యాల విషయంలో కాస్త ఫ్లెక్సిబుల్‌గా ఉండడం మంచిది. అయితే పోస్టింగ్ స్థాయికి తగ్గకుండా.. జీతభత్యాలను బేరం ఆడాల్సి ఉంటుంది. పైన చెప్పిన టిప్స్ పాటిస్తే.. కచ్చితంగా మంచి ప్యాకేజ్ లభించే అవకాశం ఉంది.
జాబ్ వదులు కోవడానికి సిద్ధంగా ఉండండి!
కంపెనీ కనుక మీ సామర్థ్యానికి, మీ పని అనుభవానికి అనుగుణంగా జీతభత్యాలు ఇవ్వడానికి అంగీకరించకపోతే.. చాలా హుందాగా దానిని వదిలి వేయడానికి సిద్ధంగా ఉండండి. దీని వల్ల తాత్కాలికంగా మీకు ఇబ్బంది ఏర్పడవచ్చు. కానీ మరింత మంచి శాలరీతో వేరే జాబ్ వచ్చే అవకాశం మీకు ఉంటుందని గుర్తుంచుకోండి.
తక్కువ శాలరీకే ఒప్పుకుంటే?
జీతం తక్కువైనా ఫర్వాలేదు.. ఏదో ఒక జాబ్ ముందు తెచ్చుకుందామని అనుకుంటే.. అది తర్వాత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పదోన్నతి పొందాలన్నా లేదా మరో కంపెనీకి మారి బెటర్ శాలరీ పొందాలన్నా చాలా కష్టమవుతుంది. సమయం కూడా బాగా వృథా అవుతుంది. కనుక శాలరీ విషయంలో రాజీ పడకూడదు.
నైపుణ్యాలు పెంచుకోవాలి!
ఒకసారి ఉద్యోగం వచ్చిన తరువాత రిలాక్స్ అయిపోకూడదు. అప్పటికప్పుడు సరికొత్త నైపుణ్యాలను డెవలప్ చేసుకోవాలి. అప్పుడే ఉద్యోగ భవిషత్తు ఆశాజనకం, లాభదాయకంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్!