RSS vs Congress: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తలు ధరించే ఖాకీ నిక్కరు తగలబడుతున్న ఫొటోను కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. ఫొటోపై మరో 145 రోజులు మాత్రమే భారత్ జోడో యాత్ర ఉందనే క్యాప్షన్ రాసి ఉంది. అంతేకాదు.. భాజపా ఆర్‌ఎస్‌ఎస్‌ల విద్వేష సంకెళ్ల నుంచి దేశాన్ని రక్షిస్తామని.. ఆ దిశగా లక్ష్యాన్ని చేరుకుంటామని అందులో పేర్కొంది. కాంగ్రెస్ చర్యపై భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లో తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. హింసను ప్రేరేపించేలా కాంగ్రెస్ ట్వీట్ ఉందని.. భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. రాహుల్ గాంధీ తరచూ 'నిప్పు' అనే పదాన్ని వాడుతుంటారని.. అగ్నిపథ్ నియామకాలకు సంబంధించి రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు.
దేశాన్ని ద్వేషిస్తూ ఐక్యంగా ఉంచగలరా..
ప్రజలను ద్వేషిస్తూనే వారికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్‌మోహన్ వైద్య ధ్వజమెత్తారు. సోమవారం ఆయన రాయ్‌పుర్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని ద్వేషిస్తూ ఐక్యంగా ఉంచగలరా? అని ప్రశ్నించారు. హిందూత్వకు సమాజంలో మద్దతు రోజురోజుకూ పెరుగుతోందని వివరించారు.
రాహుల్ యాత్రకు విశేష స్పందన..
ద్వేషం, హింసతో ఎన్నికలు నెగ్గొచ్చని, కానీ వీటితో దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించలేమని, ఈ విషయాన్ని భాజపా నిరూపించిందని రాహుల్‌గాంధీ అన్నారు. సోమవారం ఆయన 'భారత జోడో యాత్ర'లో భాగంగా కేరళలో రెండో రోజు తన యాత్రను వెల్లాయిని జంక్షన్ నుంచి ప్రారంభించారు. పెద్దయెత్తున ప్రజలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాహుల్‌ను అనుసరించారు. విద్యార్థులు, యువక్రీడాకారులు, సమాజంలోని వివిధ వర్గాలతో సంభాషిస్తూ కాంగ్రెస్ నేత ముందుకు కదిలారు. యాత్ర మధ్యలో ప్రజలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ.. "భారత్ అనే స్వప్నాన్ని భాజపా భగ్నం చేసింది. ఆ స్వప్నాన్ని మళ్లీ సాధించటానికి, భారత్‌ను ఏకతాటిపైకి తీసుకురావడానికే ఈ యాత్ర చేస్తున్నాం"అని చెప్పారు.
అమిత్ షా మఫ్లర్ రూ.80 వేలు..
టీ షర్ట్‌ల పేరుతో భాజపా రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మండిపడ్డారు. తమ పార్టీ చేపడుతోన్న 'భారత్ జోడో యాత్ర'కు విశేష స్పందన వస్తోన్న నేపథ్యంలో.. కాషాయ దళం ఆందోళనకు గురవుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీ షర్ట్ ధర రూ.41 వేలంటూ ఇటీవల భాజపా చేసిన విమర్శలను సోమవారం గహ్లోత్ తిప్పికొట్టారు. కేంద్ర మంత్రి అమిత్ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలు ఉంటుందన్నారు. భాజపా నేతలు రూ.2.50 లక్షల విలువైన సన్‌గ్లాసెస్ ధరిస్తారని విమర్శించారు.
'భారత్ జోడో యాత్రతో భాజపా నేతలకు వచ్చిన ఇబ్బందేంటి? రూ.2.50 లక్షల సన్ గ్లాసెస్, రూ.80 వేల మఫ్లర్‌లు ధరిస్తూ.. రాహుల్ గాంధీ టీ షర్ట్ గురించి మాట్లాడుతున్నారు. హోంమంత్రి అమిత్ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలు ఉంటుంది' అని గహ్లోత్ విలేకరులతో అన్నారు. టీ షర్టులపై భాజపా రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మరోవైపు.. కాంగ్రెస్ పాదయాత్రకు ప్రజల నుంచి అసాధారణ స్పందన వస్తోందని, దీంతో భాజపా నేతలు కలవరపడ్డారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర నేతలు.. తమ పనులు వదిలిపెట్టి మరీ రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా.. గత వారం కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ రూ.41 వేల టీ షర్ట్ ధరించారని భాజపా ఆయనపై విమర్శలకు దిగింది. విదేశీ బ్రాండ్ టీషర్ట్ ధరించి.. ఆయన యాత్రకు వెళ్లారని అమిత్ షా ఎద్దేవా చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ సైతం దీటుగానే స్పందించింది. దుస్తుల గురించి మాట్లాడాల్సి వస్తే.. ప్రధాని మోదీ రూ.10 లక్షల సూట్, రూ.1.5 లక్షల కళ్లజోడు గురించి మాట్లాడాల్సి వస్తుందంటూ ట్వీట్ చేసింది.
ఇవీ చదవండి: గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి.. అక్కడ మాత్రం..