బైకుల హ్యాండిళ్లు విరగొట్టి.. అమాంతం దొంగతనం చేసేస్తారు. చోరీ చేసిన బైకులకు పోలీస్ నేమ్‌ప్లేట్ తగిలించి సులభంగా వేరే చోటుకు తరలిస్తారు. ఓఎల్ఎక్స్లో కస్టమర్లు అప్లోడ్ చేసే బైకుల ధ్రువపత్రాల ఆధారంగా నకిలీ పత్రాలు తయారు చేస్తారు. అంతే, బైక్‌ను తక్కువ ధరకు విక్రయిస్తారు. బెంగళూరులో రాజస్థాన్‌కు చెందిన కొందరు యువకులు డబ్బు కోసం చేస్తున్న దందా ఇది.
రాజస్థాన్‌కు చెందిన వికాస్ కుమార్, ధవల్ దాస్, దశరథ్‌లు బెంగళూరులోని ఓ మెకానిక్, హార్డ్‌వేర్ షాప్‌లో పనిచేస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి అనేక ద్విచక్రవాహనాలను చోరీ చేశారు. వీటన్నింటినీ తీసుకెళ్లి ఆంధ్రహళ్లి ప్రాంతంలో పార్క్ చేసేవారు. తక్కువ ధరకు ఒక్కొక్కటిగా బైకులను విక్రయించారు.
బైకులు విక్రయించగానే రాజస్థాన్‌కు వెళ్లిపోతారు. అక్కడికి వెళ్లి విలాస జీవితం గడుపుతారు. డబ్బులు అయిపోతే మళ్లీ చోరీని ముందేసుకుంటారు. బెంగళూరుకు వచ్చి తమ చోరకళను ప్రదర్శిస్తారు. రాజస్థాన్ నుంచి బెంగళూరు మధ్య వీరంతా విమానాలలో వచ్చి వెళ్తారంటే.. వీరి భోగాలు అర్థం చేసుకోవచ్చు.
ఓఎల్ఎక్స్ రిజిస్ట్రేషన్
చోరీ చేసిన బైక్‌లకు పత్రాలు తయారు చేసేందుకు ఓఎల్‌ఎక్స్‌ను ఉపయోగించుకున్నారు ఈ నిందితులు. వేరే కస్టమర్లు అప్లోడ్ చేసిన బండి కాగితాలను ఆధారంగా చేసుకొని ఫోర్జరీకి పాల్పడేవారు. నకిలీ ఆర్సీ బుక్‌లు తయారు చేసి.. చోరీ చేసిన బైక్‌లను ఓఎల్ఎక్స్లోనే విక్రయించేవారని పోలీసులు తెలిపారు.
సులభంగా రవాణా చేసేందుకు బైక్‌లపై పోలీస్ నేమ్‌ప్లేట్‌ను తగిలించేవారు. ఓ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌కు ఏకంగా సబ్ ఇన్స్పెక్టర్ అన్న పేరునే జత చేశారు. లాక్డౌన్ సమయంలో బైక్‌లను ఆపకుండా ఉండేందుకు ఇలా చేశారని పోలీసులు తెలిపారు. నిందితులను బెంగళూరు కామాక్షిపలియా పోలీసులు అరెస్టు చేశారు. 26 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: భారత్-చైనా మధ్య 12వ విడత చర్చలు షురూ