అజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జైళ్లలో ఉన్న ఖైదీల శిక్షను తగ్గించే ప్రణాళికలను కేంద్రం రూపొందించింది. 50ఏళ్లు దాటిన మహిళలు, ట్రాన్స్‌జెండర్ ఖైదీలకు శిక్ష తగ్గించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. అయితే.. జైళ్లలో వారి ప్రవర్తనను బట్టి మాత్రమే శిక్ష తగ్గింపు ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. మొత్తం శిక్షాకాలంలో సగంపైన పూర్తి చేసుకున్న 60ఏళ్లు దాటిన పురుషులు, దివ్యాంగులైన ఖైదీలకు కూడా జైలు శిక్షను తగ్గించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 70శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ మేరకు అర్హత లభిస్తుంది. 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువఖైదీలపై ఎలాంటి ఇతర క్రిమినల్ కేసులు లేకుండా, వారు 50శాతం శిక్షాకాలం పూర్తి చేసుకుంటే వారిని కూడా పరిగణనలోకి తీసుకుని విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం పంపింది.
Prisoners India release date: శిక్షాకాలం పూరైనప్పటికీ కోర్టు విధించిన జరిమానాలు కట్టలేక జైళ్లలోనే మగ్గుతున్న నిరుపేద ఖైదీలకు వారి జరిమానాలను రద్దు చేయనున్నారు. కేంద్రం నిర్దేశించిన అర్హతలు ఉన్న ఖైదీలను 3 విడతల్లో విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ ఏడాది ఆగస్టు 15న కొందరిని, వచ్చే ఏడాది జనవరి 26 మరికొందరిని, 2023 ఆగస్టు 15న మరికొందరిని మొత్తం మూడు విడతల్లో ఖైదీల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్రం సమాచారం పంపింది. అయితే.. మరణశిక్ష, జీవితఖైదు పడిన ఖైదీలు, అత్యాచారం, తీవ్రవాద చర్యలకు పాల్పడినవారు, వరకట్న కేసుల్లో దోషులు, మనీలాండరింగ్ నేరస్థులు శిక్ష తగ్గింపునకు అర్హులుకాదని కేంద్రం తెలిపింది. పేలుడు పదార్థాల చట్టం, జాతీయ భద్రతా చట్టం, యాంటీ-హైజాకింగ్ చట్టం, అధికార రహస్యాలచట్టం, మానవ అక్రరవాణా నిరోధక చట్టం కింద దోషులకు శిక్ష తగ్గింపు పథకం వర్తించదని కేంద్రం స్పష్టంచేసింది.
జైళ్లలో సత్ప్రర్తన ఆధారంగానే జైలు శిక్ష తగ్గింపు పథకం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. గత మూడేళ్ల కాలంలో జైలులో వారికి ఎలాంటి శిక్ష విధించకుండా ఉంటేనే తగ్గింపు ఉంటుందని వివరించింది. సీనియర్ సివిల్, పోలీసు అధికారులతో కూడిన రాష్ట్రస్థాయి స్క్రీనింగ్ కమిటీ నిశిత పరిశీలన తర్వాతే అర్హులైన ఖైదీలను విడుదల చేయాలని కేంద్రం స్పష్టంచేసింది. స్క్రీనింగ్ కమిటీకి ఆయా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల హోంశాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేకుంటే ముఖ్య కార్యదర్శి ఛైర్మపర్శన్‌గా ఉండాలని సూచించింది. న్యాయశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక సభ్యుడిగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ మరో సభ్యుడిగా ఉండాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఖైదీల అర్హతలు, ప్రవర్తన పట్ల ఆ కమిటీ సంతృప్తి చెందితేనే శిక్ష తగ్గించి విడుదల చేయాలని స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరైన కేసులను హోంశాఖ అనుమతి కోసం పంపాలని సూచించింది. విదీశీ ఖైదీలను కేంద్రం హోంశాఖ ఆ తర్వాత విదేశాంగ శాఖ ఆమోదం తీసుకున్న తర్వాతే విడుదల చేయాలని తేల్చిచెప్పింది.
India prison population: అధికారిక అంచనాల ప్రకారం..2020లో దేశంలోని జైళ్లు నిండిపోయాయని సమాచారం. దేశంలోని జైళ్ల సామర్థ్యం 4.03లక్షలుకాగా.. 2020లో 4.78 లక్షల మంది ఉన్నారని అంచనా. వారిలో లక్షమంది వరకు మహిళలు.