Students Protest Against Principal Behavior: ఓ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక విద్యార్థులు ఆందోళనకు దిగిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. అజిత్‌సింగ్ నగర్‌లోని నవోదయ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి.. తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థినులు వాపోయారు. అర్ధరాత్రులు క్లాసులు చెప్పడానికి వస్తాడని.. చెప్పారు. రోజంతా ఒక్క క్లాసు కూడా జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నల్ మార్కులు ఉండటం, ప్రిన్సిపాల్ కమ్ ఛైర్మన్‌గా ఆయనే ఉండటంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదని వాపోయారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు.. కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శరీర భాగాలపై చేతులతో తాకడం, అసభ్యకరంగా మాట్లాడటం వంటివి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలా వెలుగులోకి..: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బిల్డింగ్‌లో గత ఆరు సంవత్సరాల నుంచి నవోదయ నర్సింగ్ కాలేజ్ నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా అలాగే ఛైైర్మన్‌గా రవీంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇందులో రాజమండ్రి, అల్లూరి సీతారామరాజు, తెలంగాణ రాష్ట్రం భద్రాచలం జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థినులు బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం స్టాఫ్ నర్స్ కోర్సులు అభ్యసిస్తున్నారు.
ప్రస్తుతం ఎండాకాలం సెలవులు కావడంతో కాలేజీ హాస్టల్‌లోనే కొద్దిమంది విద్యార్థులు ఉంటున్నారు. గిరిజన ప్రాంతాలకు చెందిన వారు కావడంతో అక్కడే ఉండి చదువుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని ఈ సంవత్సరం జనవరిలో కాలేజీలో జాయిన్ అయ్యింది. అయితే కొద్ది వారాల కిందట ఆ విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను నవోదయ కాలేజీలో చదవనని, ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో ఆ తల్లిదండ్రులు.. అజిత్ సింగ్ నగర్లో నివాసం ఉంటున్న తమ బంధువుకు విషయం చెప్పి.. కళాశాలకు వెళ్లి రావాలని కోరారు. ఈ క్రమంలో కాలేజీకి వచ్చిన ఆ వ్యక్తికి.. ఆ విద్యార్థిని తమ కాలేజీలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి తెలిపింది. ఆమెతో పాటు మరికొంత మంది కూడా ఇదే రీతిలో చెప్పడంతో వారు టీసీ ఇవ్వాలని ప్రిన్సిపాల్‌ను కోరారు. అయితే టీసీ ఇచ్చేందుకు ప్రిన్సిపాల్నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కాలేజీ ఎదుట ఆందోళన..: విద్యార్థినులతో ప్రిన్సిపాల్ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు సోమవారం కళాశాల ఎదుట ఆందోళన చేపట్టాయి. ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి తమను లైంగికంగా వేధిస్తున్నాడని, ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడని, కనీసం తమ తల్లిదండ్రులతో కూడా ఫోన్లో సరిగ్గా మాట్లాడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా చెబితే తమకు ఇంటర్నల్ మార్కులు తగ్గిస్తారనే భయంతో ఇన్నిరోజులు ఈ విషయాలను బయటకు చెప్పకుండా నరకయాతన పడుతున్నామని వారు వాపోయారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి P.పద్మ, P.D.S.U రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రవిచంద్ర, రాజేశ్ లు బాధితులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. రవీంద్రరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.