ETV Bharat / bharat

Margadarsi Labbipeta Manager: మార్గదర్శి బ్రాంచ్‌ మేనేజర్‌పై పోలీసుల దౌర్జన్యం.. కనీస సమాచారం ఇవ్వకుండా తరలింపు - మార్గదర్శి చిట్ ఫండ్ లబ్బీపేట బ్రాంచ్

Margadarsi Labbipeta Branch Manager: విజయవాడలోని మార్గదర్శి చిట్ ఫండ్ లబ్బీపేట బ్రాంచ్ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావును పోలీసులు దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్యం సరిగాలేక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీనివాసరావును.. కనీసం కేసు వివరాలేంటో కూడా చెప్పకుండా అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఏదో కరడుగట్టిన నేరస్థుడు అన్నట్టు వ్యవహరించారు.

Margadarsi Labbipet Branch Manager
Margadarsi Labbipet Branch Manager
author img

By

Published : Jul 21, 2023, 8:05 AM IST

జయవాడ బ్రాంచ్‌ మేనేజర్‌పై పోలీసుల దౌర్జన్యం

Police Taken Margadarsi Labbipeta Branch Manager into Custody: విజయవాడ పటమటలంకలోని మార్గదర్శి చిట్‌ ఫండ్ లబ్బీపేట బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు ఇంటికి.. గురువారం ఉదయం 11గంటల సమయంలో సివిల్ దుస్తుల్లో వచ్చిన కృష్ణలంక స్టేషన్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. తమ వెంట రావాలని శ్రీనివాసరావుకు హుకుం జారీచేశారు. అసలు మీరు ఎవరు? సీఐడీ అధికారులా? అని శ్రీనివాసరావు సతీమణి వారిని ప్రశ్నించారు. తాము కృష్ణలంక పోలీసులమని.. సివిల్ డ్రెస్లో వచ్చామని, మర్యాదగా తమ వెంట వస్తే హడావుడి లేకుండా ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తామన్నారు. శ్రీనివాసరావు చేతిలోని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో పనిమనిషి సైనా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఇంట్లోనే పనిచేస్తావా.. వేరేచోట కూడా చేస్తున్నావా? అని ప్రశ్నించారు. తాము ఇక్కడికి వచ్చినట్లు ఎవరికీ చెప్పొద్దంటూ ఆమెను హెచ్చరించారు.

శ్రీనివాసరావును అదుపులోకి తీసుకునే క్రమంలో.. పోలీసులు సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిబంధనల్ని ఉల్లంఘించారు. ఈ విషయంపై ఏ పోలీసు అధికారి సమాచారం ఇవ్వలేదు సరికదా.. ఆయన గురించి అడిగితే పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. అసలు పోలీసులు ఆగంతకుల్లా సివిల్ దుస్తుల్లో రావలసిన అవసరం ఏంటి? పోలీసు దుస్తుల్లో వస్తే... శ్రీనివాసరావు ఏమైనా పారిపోయే వ్యక్తా? వారెంట్ లేకుండా, కేసు వివరాలేంటో చెప్పకుండా విచారణ పేరుతో ఎలా తీసుకెళతారు? కృష్ణలంక సీఐ దుర్గారావుతో పాటు టాస్క్‌ఫోర్స్‌ కు చెందిన ఇద్దరు సీఐలు, వారి సిబ్బంది వచ్చినట్లు తెలిసింది. శ్రీనివాసరావును తీసుకెళ్లేటప్పుడు ఎక్కడికి, ఏ కేసు దర్యాప్తు కోసమని ఆయన సతీమణి ఎన్నిసార్లు.. అడిగినా కనీస సమాచారం ఇవ్వకుండానే బలవంతంగా తీసుకెళ్లిపోయారు.

అదేం లేదని బుకాయింపు: శ్రీనివాసరావు విషయమై పోలీసు అధికారులను 'ఈనాడు', 'ఈటీవీ' ప్రతినిధులు ఫోన్లో సంప్రదించగా తమకేమీ సంబంధం లేదని బుకాయించారు. ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు? ఏ పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు? ఎవరు తీసుకెళ్లారని ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేదు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా దాటవేత ధోరణిలో సమాధానం చెప్పి తప్పించుకున్నారు. సౌత్ ఏసీపీ రవికిరణ్‌ను వివరాలు అడిగితే.. తాము అదుపులోకి తీసుకోలేదని, తమకేం సంబంధంలేదని బుకాయించారు. కృష్ణలంక సీఐ దుర్గారావు కూడా ఇదే సమాధానం ఇచ్చారు. సీఐడీ అధికారులు ఏమైనా తీసుకెళ్లారేమో అంటూ పొంతనలేని సమాధానాలిచ్చారు.

వివరాలు తెలుసుకునేందుకు శ్రీనివాసరావు తరపు న్యాయవాది కృష్ణలంక స్టేషన్‌కు వెళ్లగా, ఆయనకూ సరైన సమాధానం ఇవ్వలేదు. మార్గదర్శి కేసును సీఐడీ విచారిస్తోంది కదా.. వారు తీసుకెళ్లారేమో.. అంటూ సీఐ దుర్గారావు వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. తమకు సంబంధం లేదని, సీఐడీ అధికారులు.. సహకారం కోరితేనే జోక్యం చేసుకుంటామని చెప్పి బయటకు వెళ్లిపోయారు. న్యాయవాది మళ్లీ సాయంత్రం స్టేషన్‌కు వచ్చినప్పుడు మాత్రం.. శ్రీనివాసరావు తమ అదుపులో ఉన్నారని, శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరుస్తామని చెప్పి పంపించారు.

ఎక్కడున్నారో సమాచారం లేదు: గురువారం ఉదయం 11 గంటలకు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రాత్రి వరకూ ఆయన కుటుంబసభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదు. ఎక్కడ ఉన్నారో చెప్పలేదు. దర్యాప్తు పేరుతో వివిధ ప్రాంతాలు, స్టేషన్లకు పోలీసులు తిప్పినట్లు తెలిసింది. శ్రీనివాసరావును ఇంటినుంచి తీసుకెళ్లిన తర్వాత టాస్క్ పోర్స్ కార్యాలయానికి తరలించారు. అనంతరం సీసీఎస్‌కు, అక్కడి నుంచి కృష్ణలంక స్టేషన్‌కు, మరో ప్రాంతానికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.

కృష్ణలంక స్టేషన్‌ వద్ద హడావుడి: కృష్ణలంక స్టేషన్ వద్ద మధ్యాహ్నం నుంచి హడావుడి కనిపించింది. సౌత్ ఏసీపీ రవికిరణ్ స్టేషన్‌కు చేరుకుని సాయంత్రం వరకూ అక్కడే ఉన్నారు. అదే సమయంలో పశ్చిమ డివిజన్ ఏసీపీ హనుమంతరావు, పటమట సీఐ కాశీ విశ్వనాథ్, గవర్నర్‌పేట సీఐ సురేష్ వచ్చారు. వివరాలు అడిగితే వేరే కేసుపై వచ్చామని చెప్పి వెళ్లిపోయారు. వీరితో పాటు సీఐడీ, ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా పలుసార్లు వచ్చారు. ఓ కేసు విషయమై అదుపులోకి తీసుకున్నామని.. వివరాలు విలేకరుల సమావేశంలో సీపీ వివరిస్తారని సౌత్ ఏసీపీ రవి కిరణ్ సాయంత్రం ముక్తసరిగా చెప్పారు.

లబ్బీపేట మార్గదర్శి కార్యాలయంలో..: కృష్ణలంక సీఐ దుర్గారావు మధ్యాహ్నం మూడున్నర సమయంలో లబ్బీపేటలోని మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయానికి సీఐడీ సిబ్బందితో కలిసివచ్చారు. బ్రాంచిలో ఓ చిట్ వివరాలు తీసుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు అక్కడే ఉండి సిబ్బంది నుంచి పలు దస్త్రాల నకళ్లు తీసుకుని, సీఐడీ సిబ్బందిని అక్కడే ఉంచి వెళ్లిపోయారు.

ఈటీవీ కెమెరామన్‌ ఫోన్‌ లాక్కున్న పోలీసులు: మార్గదర్శి లబ్బీపేట శాఖలో పోలీసులు ఉండగా ఈటీవీ కెమెరామన్ తన ఫోన్లో వీడియో చిత్రీకరించారు. తర్వాత పోలీసులు వెళ్లిపోయారు. రాత్రి 8.30సమయంలో కృష్ణలంక ఎస్.ఐ. మనోహర్ వచ్చి రుబాబు చేశారు. సీఐ దుర్గారావు తీసుకురమ్మన్నారని చెప్పి.. కెమెరామన్ వద్ద ఉన్న ఫోన్, ఐడీ కార్డు లాక్కున్నారు. ఎందుకు వీడియో తీశావని దుర్భాషలాడుతూ వాటిని తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే.. వెంటనే ఇవ్వాలని ఆయన కింది అధికారులకు చెప్పారు. అయినా వెంటనే ఇవ్వకుండా.. అదిగో ఇదిగో అంటూ గంటన్నర పాటు కృష్ణలంక పోలీసులు ఇబ్బంది పెట్టారు.

అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన: శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి విజయవాడ పోలీసులు అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించారు. ఎవరినైనా అరెస్టు చేస్తున్నప్పుడు, విచారిస్తున్నప్పుడు తన పేరు, హోదా స్పష్టంగా కనిపించేలా నేమ్‌ బ్యాడ్జి తప్పనిసరిగా ధరించాలని డికే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులెవరూ నేమ్‌ బ్యాడ్జ్‌ ధరించలేదు. సరికదా, కనీసం పోలీసు దుస్తుల్లోనూ లేరు. ఇది ముమ్మాటికీ కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించడమే.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 50 ప్రకారం... వారెంట్ లేకుండా వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు.. ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో రాతపూర్వకంగా తెలియజేయాలి. రక్త సంబంధీకులకు తక్షణం సమాచారమివ్వాలి. శ్రీనివాసరావు భార్య పదేపదే అడిగినా... పోలీసులు నోటిమాటగా కూడా ఆ వివరాలేమీ చెప్పలేదు. ఆ వ్యక్తి.. న్యాయవాదిని ఏర్పాటు చేసుకునేందుకు చట్టంలో వెసులుబాటు ఉంది. శ్రీనివాసరావు న్యాయవాది మొదటిసారి పోలీసుస్టేషన్‌కు వెళ్లి అడిగినా... తమకేమీ సంబంధం లేదని అబద్ధం చెప్పారు. శ్రీనివాసరావును అరెస్టు చేసిన పోలీసులు... గురువారం అర్ధరాత్రి వరకూ ఎక్కడ ఉంచినదీ కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.