Poclain operator burn alive: ఝార్ఖండ్ బొకారోలోని బొగ్గుగనిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పొక్లైన్లో మంటలు చెలరేగడం వల్ల ఆపరేటర్ సజీవ దహనమయ్యాడు. సరైన భద్రత ప్రమాణాలు పాటించకుండా మైనింగ్ చేపట్టడం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని కార్మిక నాయకులు తెలిపారు. ధోరి ప్రాంతంలోని కల్యాణి ఎస్డీఓసీఎమ్ ప్రాజెక్ట్ పరిధిలోని కోల్ఇండియా బొగ్గుగనిలో మహేంద్ర అనే వ్యక్తి పొక్లైన్ నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా మైనింగ్ చేపట్టడం వల్ల వాహనంలో మంటలు చెలరేగాయి. సహాయక సిబ్బంది చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. మంటలు అధికమవడం వల్ల మహేంద్ర సజీవ దహనమయ్యాడు. అనంతరం నీటితో మంటలను ఆర్పి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనా స్థలానికి కార్మికులు పెద్దఎత్తున చేరుకున్నారు.
"సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే మంటలు ఉన్నాయి. ముందుగా హైవాల్ నుంచి తొలగిస్తూ ఓవర్‌బర్డెన్ వైపు రావాలి. కానీ అలా చేయకుండా ఓవర్వర్డెన్ను తొలగించారు. అందుకే మంటలు వ్యాపించి వాహనం సహా ఆపరేటర్ మరణించారు."
- నారాయణ్ మహతో, కార్మిక నాయకుడు
మరోవైపు ఈ ఘటనకు కోల్ ఇండియా యాజమాన్యం, ఔట్సోర్సింగ్ కంపెనీల వైఫల్యమే కారణమని కార్మిక నాయకుడు వికాస్ సింగ్ ఆరోపించారు. గనుల సెక్యూరిటీ సిబ్బందిని మైనింగ్ సహా ఇతర పనులు చేయించుకుంటున్నారని.. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 7వ అంతస్తు పిట్టగోడపై కూర్చోని రోగి హల్చల్.. చివరకు కిందపడి మృతి