భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ ప్రణాళికను ఆవిష్కరించారు. యువతకు ఉద్యోగ కల్పన, తయారీ రంగ అభివృద్ధి కోసం రూ.100 లక్షల కోట్లతో 'గతిశక్తి' కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక తయారీదారులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా మార్చనున్నట్లు తెలిపారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన మోదీ.. దాదాపు 90 నిమిషాల పాటు ప్రసంగించారు. భారత్‌లోని అణగారిణ వర్గాలు, రైతులు, దేశ విభజన పరిస్థితులు, ఉగ్రవాదం, విస్తరణవాదం వంటి అంశాలపై మాట్లాడారు. ప్రధానిగా ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగించడం ఇది వరుసగా ఎనిమిదోసారి కావడం విశేషం.
సమగ్రాభివృద్ధికి బాటలు పరిచేలా.. రానున్న 25 ఏళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వందో స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 'ఆత్మనిర్భర్ భారత్' అన్న కలను సాకారం చేసుకోవాలని అన్నారు. భారత్ ప్రబలశక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. 'సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్' అన్న నినాదాలతో నూతన ఇండియాను నిర్మించుకోవాలని చెప్పారు.
అంతర్జాతీయ సంబంధాలపై...
సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం ద్వారా ప్రపంచానికి సరికొత్త సందేశాన్ని భారత్ పంపిందని మోదీ అన్నారు. ఇది నూతన భారత్ అని చాటి చెప్పిందని పేర్కొన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు దేశం వెనకాడదని తెలిపారు. ఉగ్రవాదాన్ని, విస్తరణవాదంపై దేశం పోరాడుతోందని పరోక్షంగా పాకిస్థాన్, చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
"రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ సంబంధాల్లో గణనీయమైన మార్పులు సంభవించాయి. కరోనా అనంతరం కూడా ప్రపంచ స్థితిగతులు మారే అవకాశం ఉంది. ప్రపంచం చేస్తున్న కృషిని భారత్ గమనిస్తోంది. భారత్‌ను ప్రపంచం నేడు సరికొత్త దృష్టికోణంలో చూస్తోంది. ఈ దృక్కోణంలో రెండు అంశాలు ముఖ్యమైనవి. ఒకటి ఉగ్రవాదం, ఇంకోటి విస్తరణవాదం. ఈ రెండు సవాళ్లను భారత్ ఎదుర్కొంటూ.. ధైర్యంగా స్పందిస్తోంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
చిన్న, సన్నకారు రైతులను దేశానికే తలమానికంగా మార్చనున్నట్లు చెప్పారు. 80 శాతం మంది రైతులు రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నారని గుర్తు చేసిన ఆయన.. వీరిని దృష్టిలో ఉంచుకొనే పథకాలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గ్రామాలు వేగంగా మారిపోతున్నాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల నుంచీ డిజిటల్ వర్తకులు పుట్టుకొస్తున్నారని చెప్పారు.
అందరికీ నల్లా నీరు
జల్ జీవన్ మిషన్ కింద గత రెండేళ్ల వ్యవధిలో 4.5 కోట్ల ఇళ్లకు నల్లా నీరు అందించినట్లు ప్రధాని తెలిపారు. 2024 నాటికి గ్రామాల్లోని అన్ని గృహాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని 2019 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు మోదీ.
పేదలకు బలవర్ధక ఆహారం..
పోషకాహార లోపం సమస్యను పరిష్కరించేందుకు 2024 నాటికి దేశంలోని పేదలందరికీ బలవర్దకమైన బియ్యం అందిస్తామని మోదీ తెలిపారు. పేద పిల్లల ఎదుగుదలపై పోషకాహార లోపం తీవ్ర ప్రభావం చూపిస్తోందని అన్నారు.
రిజర్వేషన్లు...
రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. అణగారిన వర్గాలకు ఆపన్నహస్తం అందించడం అవసరమని అన్నారు. దళితులు, ఎస్టీలు, వెనకబడిన వర్గాలు, జనరల్ కేటగిరీలోని పేదలకు రిజర్వేషన్లు అందేలా చూస్తామని స్పష్టం చేశారు.
'ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేద్దాం'
ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణానికి సమగ్ర విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రస్తుత తరం సాంకేతికతను ఉపయోగించి ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని అన్నారు. ఏడేళ్ల క్రితం భారత్ 8 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకుందని.. ప్రస్తుతం 3 బిలియన్ డాలర్ల ఫోన్లను ఎగుమతి చేరే స్థాయికి చేరిందని మోదీ వివరించారు.
'ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్'తో దేశంలో అనేక ఎకనామిక్ జోన్లు ఏర్పాటవుతాయని తెలిపారు. భారత్‌ను గ్రీన్ హైడ్రోజన్‌కు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఇందుకోసం నేషనల్ హైడ్రోజన్ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈశాన్యానికి రైల్వే
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరిగే 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రయాణిస్తాయని మోదీ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల రాజధానులను రైల్వేతో అనుసంధానిస్తామని అన్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ సహా దక్షిణాసియాలోని ఇతర దేశాలతో ఈ రాష్ట్రాలు అనుసంధానమవుతున్నాయని తెలిపారు.
కశ్మీర్
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు జరుగుతున్నాయని మోదీ చెప్పారు. 'కశ్మీర్లో అభివృద్ధి ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన కొనసాగుతోంది' అని అన్నారు.
విద్య
నూతన విద్యా విధానం పేదరికంపై పోరాటానికి ఉపకరిస్తుందని అన్నారు మోదీ. మాతృభాషల్లో విద్యాబోధనకు ఈ విధానం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. మరోవైపు, దేశంలోని అన్ని సైనిక పాఠశాల్లో బాలికలకూ ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం అడ్డుగా ఉన్న నిబంధనలను తొలగించాలని అన్ని శాఖలకు పిలుపునిచ్చారు.
అదిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం
కొవిడ్ నిబంధనల మధ్య జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. ఇది కేవలం వేడుక కాదని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో జరుగుతోందని చెప్పారు. దీన్ని ప్రజలు గౌరవంగా భావించాలని అన్నారు. టీకా తయారీలో భాగస్వాములైన వారిని మోదీ కొనియాడారు. కరోనా పోరులో ముందున్న వైద్యులు, వైద్య సిబ్బంది సేవలను ప్రశంసించారు.
'విభజన.. ఓ గాయం'
దేశ విభజనను గడిచిన వందేళ్ల వ్యవదిలో అత్యంత విషాదకర ఘటనగా అభివర్ణించారు మోదీ. అప్పటి విషాదకర పరిస్థితులకు గుర్తుగానే ఆగస్టు 14న 'విభజన విషాద స్మృతి దినం'గా జరుపుకోనున్నట్లు పేర్కొన్నారు.
ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులను మోదీ అభినందించారు. వారి ప్రదర్శన దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. దేశ యువతపై తనకు అపార విశ్వాసం ఉందని మోదీ అన్నారు. ప్రస్తుత తరం ఏదైనా సాధించగలదని.. ఎలాంటి లక్ష్యాలనైనా చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
పంద్రాగస్టు ప్రత్యేక కథనాలు
- భరతమాతకు స్వాతంత్ర్యం- ఎందరో మహానుభావుల త్యాగఫలం
- గాంధీ 'సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం'తోనే స్వాతంత్ర్యం
- స్వతంత్ర భారతావని... శతాబ్దపు ప్రజాస్వామ్య వింత!
- ప్రపంచ దేశాలకు మార్గదర్శకం.. భారత స్వాతంత్ర్యోద్యమం
- స్వాతంత్య్ర దినోత్సవం పంద్రాగస్టే ఎందుకంటే?
- విదురాశ్వత విషాద ఘటన.. స్వాతంత్య్రోద్యమానికి కొత్త దిశ
- మహోజ్జ్వల వేళ విభజన హోమం!
- ఐదు వారాల్లో.. అడ్డంగా గీసేసి అడ్డదిడ్డ దేశ విభజన!
- దేశదీపధారులు- వీరే 'భారత' వీరులు