స్వాతంత్య్రం అనంతరం మొదటిసారి రక్షణ రంగంలో భారీ సంస్కరణలు (defence sector reforms) చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దీంతో ఈ రంగంలో మునుపెన్నడూ లేనంతగా పారదర్శకత, విశ్వాసం పెంపొందాయని తెలిపారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ స్థానంలో ఏర్పాటు చేసిన 7 ఆయుధ కర్మాగారాలను జాతికి అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.
"గత ఏడేళ్లుగా దేశాన్ని స్వావలంబన దిశగా నడిపిస్తున్నాము. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేశాము. ప్రస్తుతం రక్షణ వ్యవస్థలో పారదర్శకత, విశ్వాసం పెంపొందించాము. స్వాతంత్య్రం తర్వాత రక్షణ రంగాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉన్నా.. ఎవరూ శ్రద్ధ చూపలేదు. మేము అది చేసి చూపించాము."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
అదే లక్ష్యం..
రక్షణ పరికరాల ఉత్పత్తిలో భారత్ స్వయంసమృద్ధి సాధించడానికి సింగిల్ విండో విధానాలను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా ఆయుధ సంపత్తిలో(self-reliant India campaign) భారత్‌ను ప్రపంచంలోనే మొదటిస్థానానికి చేర్చడమే లక్ష్యమని అన్నారు. రక్షణ రంగాన్ని ఆధునికీకరించాలని చెప్పారు. స్వయం సమృద్ధిని సాధించడం కోసం 41 ఆయుధ కార్మాగారాలను ఏడు పరిశ్రమలుగా మార్చినట్లు స్పష్టం చేశారు. 200 ఏళ్ల క్రితం బ్రిటీష్ వారి కాలంలో రక్షణ ఆయుధాల ఉత్పత్తికి ఏర్పాటు చేసిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ను ఏడు పరిశ్రమలుగా కేంద్రం మార్చింది.
ఇదీ చదవండి:'సర్దార్ అడుగుజాడల్లో నడిస్తేనే అభివృద్ధి'