Prime Ministers Museum: స్వాతంత్య్రానంతరం ఏర్పాటైన ప్రతి ప్రభుత్వం.. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో దోహదపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాస్వామ్య భారత లక్ష్యాల సాధనలో ప్రతి ప్రధాని ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్‌కు ప్రధాన మంత్రులుగా సేవలందించిన వారి జీవిత విశేషాలను వివరించేలా దిల్లీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.
''భారతదేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఈ మ్యూజియం అందుబాటులోకి రావడం ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. ప్రతి యుగంలో, ప్రతి తరంలో ప్రజాస్వామ్యాన్ని మరింత సాధికారికంగా, ఆధునికంగా మార్చడానికి నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. మారుమూల పల్లె నుంచి, పేదరికం నుంచి, రైతు కుటుంబం నుంచి ప్రధాని పదవిని అలంకరించడం.. భారత ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని బలపరుస్తోంది. దేశంలో ప్రతి ప్రధాని తమ హయాంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ.. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
తొలి పీఎం జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 14 మంది జీవిత విశేషాలు, వారు చేసిన సేవలు, సవాళ్లను ఎదుర్కొన్న తీరును ప్రధాన్‌మంత్రి సంగ్రహాలయంలో (ప్రధానుల మ్యూజియం) పొందుపర్చారు. దిల్లీ తీన్‌మూర్తి మార్గ్‌లోని నెహ్రూ మ్యూజియంలో ఏర్పాటైన దీనిని ప్రారంభించే ముందు.. ప్రధాని స్వయంగా టికెట్ కొని లోపలికి ప్రవేశించారు.
మాజీ ప్రధానుల నాయకత్వ లక్షణాలు, ముందుచూపు, ఘనతలను.. ప్రస్తుత యువతరానికి తెలిపేలా చేయడమే దీని ఉద్దేశం. సిద్ధాంతాలకు అతీతంగా ప్రధానుల సేవలకు గౌరవం ఇవ్వాలన్న మోదీ సంకల్పం మేరకు మ్యూజియంను ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇవీ చూడండి: 'పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు'.. హైకోర్టు సంచలన నిర్ణయం
యూపీలో యోగి మార్క్ పాలన.. 'ఏ ఫైలూ మూడ్రోజులకు మించి పెండింగ్‌లో ఉండొద్దు'