మన దేశంలో చెట్లను పూజించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. అందుకే మతాచారాలకు సామాజిక కోణాన్ని జోడించి.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది ఒడిశాకు చెందిన 'బకుల్ ఫౌండేషన్'. వృక్షాల ఆవశ్యకతను చాటేందుకు.. పండగలు, ముఖ్యమైన సందర్భాలను ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలోనే లంబోదరుడి ఆకారం వచ్చే విధంగా వృక్షాన్ని అలంకరించి.. పూజలు నిర్వహిస్తోంది. ఏనుగు తల, మానవ శరీరంతో ఉన్న వినాయకుడు.. సృష్టిలోని ఐక్యతకు చిహ్నమని ఈ సంస్థ అంటోంది.
ఒడిశా రాజధాని భువనేశ్వర్లో బిజు పట్నాయక్ పార్క్లో పూజలందుకుంటున్న ఈ లంబోదరుడు పర్యావరణ హితంగా రూపొందాడు. భువనేశ్వర్ డెవలప్‌మెంట్ అథారిటీ సహకారంతో 'బకుల్ ఫౌండేషన్' బిజు పట్నాయక్ పార్క్లో ఈ 'వృక్ష వినాయక విగ్రహం' ఏర్పాటు చేసింది. వృక్షానికి కళ్లు, తొండం, చెవులను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాన్ని రూపొందించింది. 2018 నుంచి ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లు.. అయితే కొవిడ్ కారణంగా 2020లో పండుగ జరపలేకపోయినట్టు నిర్వహకులు తెలిపారు.
వివిధ సందర్భాల్లో మొక్కలను కానుకగా ఇచ్చే పద్ధతిని 'బకుల్ ఫౌండేషన్' ప్రోత్సహిస్తోంది. కొత్త సంవత్సర వేడుకలు, ప్రేమికుల రోజు సహా.. దీపావళి, దసరా వంటి పండగలకు మొక్కలను కానుకగా ఇస్తోంది. 'వృక్ష వినాయకుడిని' పూజించేందుకు వచ్చే వారికి కూడా మొక్కను ప్రసాదంగా ఇస్తుండటం విశేషం.
"పెద్దఎత్తున మొక్కలు నాటితే పర్యావరణానికి ప్రయోజనం సరిపోతుందని అనుకోకూడదు. నిజానికి నాటిన మొక్కలన్నీ పెరిగి మహా వృక్షాలుగా మారితేనే ప్రయోజనం ఉంటుంది. అందుకే 'బకుల్ ఫౌండేషన్' 2009 నుంచి చెట్లతో సాంస్కృతిక అనుబంధాన్ని ప్రోత్సహిస్తోంది. మాకు చెట్లతో సాంస్కృతిక, వ్యక్తిగత అనుబంధం ఉంది. చెట్లను ప్రేమించడం, ఆరాధించడం వల్ల సంరక్షణ బాధ్యత పెరుగుతుంది." -సుజిత్ మహాపాత్ర, బకుల్ ఫౌండేషన్ కార్యదర్శి
వృక్ష వినాయకుడిని పూజిస్తూ.. సామాజిక స్పృహ పెంచుతున్న యువ వాలంటీర్ల కృషి, సృజనాత్మకతను బీడీఏ ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ ప్రశంసించారు. సామాజిక స్పృహ కల్పిస్తున్న వీరిని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: