Patna ADM Brutally Thrashes: బిహార్ రాజధాని పట్నా నడిబొడ్డున ఉన్న డాక్ బంగళా ప్రాంతమది. తక్షణం టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ.. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థి రహదారిపై పడుకుని జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ నినాదాలు ఇవ్వసాగాడు. అక్కడే ఉన్న అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) కె.కె.సింగ్‌కు అలా చేయడం నచ్చలేదు. పోలీసు చేతిలో నుంచి లాఠీ తీసుకుని ఆ అభ్యర్థిపై దెబ్బల వర్షం కురిపించారు. ఈ క్రమంలో లాఠీ జాతీయ జెండాకు తగులుతోందన్న సంగతిని సైతం పట్టించుకోలేదు. దెబ్బలకు తాళలేక ఆ అభ్యర్థి విలవిల్లాడాడు. అతని చెవి భాగం రక్తంతో తడిసి పోయింది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడి మీడియా, ఇతర ఉద్యోగార్థులు తమ కెమెరాలు, సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ఆయన కార్యాలయం ఓ ట్వీట్ చేసింది.
ఇవీ చూడండి: కుల పెద్దకు పెళ్లి తాంబూలం ఇవ్వలేదని 10ఏళ్లు గ్రామ బహిష్కరణ
పెట్రోల్ బంక్‌పై విరిగిపడ్డ కొండచరియలు, నాలుగు వాహనాలు ధ్వంసం