Night cuphew in tamil nadu: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా.. తమిళనాడు ప్రభుత్వం గురువారం నుంచి రాత్రిపూట లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు ఆంక్షలు కొనసాగుతాయని చెప్పింది.
"గురువారం నుంచి రాత్రిపూట లాక్డౌన్ విధిస్తున్నాం. జనవరి 9 (ఆదివారం) పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తాం. ఆ రోజు ఉదయం 7 నుంచి పది గంటల వరకు రెస్టారెంట్లలో టేక్అవేస్కు మాత్రమే అనుమతి ఉంటుంది."
-ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి.
తమిళనాడులో ఒకటో తరగతి నుంచి 9 తరగతి విద్యార్థులకు మాత్రమే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సీఎం స్టాలిన్ చెప్పారు. పది, 12 తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధనకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించే అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ..
Himachal pradesh night curphew: కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సైతం కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
"రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుంది. అంతేగాకుండా.. ఇండోర్ క్రీడా ప్రాంగణాలు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, స్టేడియం, స్విమ్మింగ్ పూళ్లు, జిమ్స్ వంటివి మూసివేయాలి. వివాహ వేడుకలకు 50శాతం మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఉంటుంది" అని రాష్ట్ర మంత్రి సురేశ్ భరద్వాజ్ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో రాత్రిపూట ఆంక్షలు
Corna restrictions in chhattisgarh: కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. అత్యవసర సేవలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిస్తున్నట్లు చెప్పింది. ఇప్పటికే.. జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయాలు, స్విమ్మింగ్ పూళ్లను మూసివేయాలని ఆదేశించింది.
ఒడిశాలో కొత్త మార్గదర్శకాలు..
Odisha covid guidelines: ఒడిశాలో 12వ తరగతి వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 10, 12 తరగతులకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని చెప్పింది. ప్రతిరోజు ఉదయం 5గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే దుకాణాలు నడుస్తాయని పేర్కొంది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.
వారికి పాఠశాలలు బంద్..
మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో జనవరి 31 వరకు ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులు.. పాఠశాలలకు హాజరుకాకూడదని నాగ్‌పుర్ జిల్లా సంరక్షక మంత్రి (గార్డియన్ మినిస్టర్) నితిన్ రౌత్ తెలిపారు.
పోలీసులకు కరోనా..
Corona in Jharkhand police: ఝార్ఖండ్ పోలీసు శాఖలో కరోనా మహమ్మారి కరోనా కలకలం సృష్టించింది. రాంచీలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ) సురేంద్ర కుమార్ సహా ఆయన కార్యాలయంలో పని చేసే 35 మంది సిబ్బందికి కరోనా నిర్ధరణ అయింది. రెండు రోజుల క్రితం కొద్ది మందికి కరోనా సోకినట్లు తేలగా.. మొత్తం 80 మందికి పరీక్షలు జరిపారు. అందులో ఈ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా సోకిన పోలీసుల్లో ఎవరికీ.. తీవ్రమైన లక్షణాలు లేవని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 14 కాదు 7 రోజులే.. కరోనా హోం ఐసోలేషన్‌కు కేంద్రం కొత్త రూల్స్
ఐఐటీలో కొవిడ్ కలకలం
Covid in iit guwahati: ఐఐటీ గువాహటిలో విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు సహా 50మందికిపైగా కరోనా బారినపడ్డారు. ఆరు రోజుల వ్యవధిలో వీరికి కరోనా సోకిందని ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో ఆంక్షలను విధిస్తున్నట్లు చెప్పారు.
పాజిటివ్ కేసుల్లో 99 శాతం మంది సెలవుల తర్వాత బయట ప్రాంతాల నుంచి వచ్చినవారేనని ఐఐటీ- గువాహటి డీన్-పీఆర పరమేశ్వర్ ఆయ్యర్ తెలిపారు. "డిసెంబరు 31 నుంచి 50 మందికిపైగా కరోనా బారినపడ్డారు. అందులో.. ఒక అధ్యాపకుడితో పాటు ఆయన ఐదుగురు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మరో సిబ్బందికీ కరోనా సోకింది. మిగతా వారంతా విద్యార్థులే" అని ఆయన వివరించారు.
వైరస్ వ్యాప్తి కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పరమేశ్వర్ అయ్యర్ తెలిపారు. పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు.. తమకు అదనపు వనరులను సమకూర్చుతున్నాయని చెప్పారు. ఎవరైనా విద్యార్థులు హాస్టల్‌ను వీడి బయటకు వెళ్లాలంటే... ముందస్తు అనుమతి తీసుకునేలా నిబంధనలు విధించామని చెప్పారు. తదపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త విద్యార్థుల చేరికపై నిషేధం విధించామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ముగ్గురు మంత్రులకు కరోనా
వైద్య విద్యార్థులకు కరోనా..
MBBS students covid positive: కర్ణాటకలోని విజయ్‌నగర్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్న 21 మంది విద్యార్థులకు కొవిడ్ సోకినట్లు తేలింది. కళాశాలకు చెందిన హాస్టల్లో ఉండే... 250 మంది విద్యార్థులకు ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించగా... ఈ కేసులు వెలుగుచూశాయని కళాశాల అధికారులు తెలిపారు. కరోనా సోకిన విద్యార్థులంతా ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారేనని చెప్పారు.
'అప్రమత్తంగా ఉండాలి'
Karnataka corona cases: ఒమిక్రాన్ వ్యాప్తి, థర్డ్‌వేవ్ ముప్పును కట్టడి చేసేందుకు వచ్చే నాలుగు నుంచి ఆరు వారాల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని కోరారు.
"ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే నాలుగు నుంచి ఆరు వారాలు అత్యంత కీలకమైనవి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితిని చూస్తే ఐదు, ఆరు వారాల్లో కరోనా కేసులు తగ్గిపోయాయి. ఈ థర్డ్ వేవ్ చాలా కాలంపాటు కొనసాగదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తరహాలోనే.. మూడు నుంచి నాలుగు నెలలపాటు కొనసాగే అవకాశం ఉంది."
-కె.సుధాకర్, కర్ణాటక ఆరోగ్యమంత్రి.
ఈ నాలుగు నుంచి ఆరు వారాలపాటు ప్రజలు అప్రమత్తంగా ఉన్నట్లైతే.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలమని సుధాకర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: భారత్ బయోటెక్ చుక్కల మందు టీకా పరీక్షలకు అనుమతి