40 మంది ఉపాధ్యాయులకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) (NIA news india) సమన్లు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌లో మైనారిటీలపై దాడులు, హత్యల వ్యవహారానికి సంబంధించిన కేసులో ఆ టీచర్లకు సమన్లు పంపింది. శ్రీనగర్‌లోని ఈద్గఢ్ ప్రాంతంలో పాఠశాల ఆవరణంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన ప్రిన్సిపాల్ సుపీందర్ కౌర్, ఉపాధ్యాయుడు దీపక్ చంద్ హత్యపై ఎన్ఐఏ దర్యాప్తు(NIA raids in Jammu and Kashmir) చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వివిధ పాఠశాలలకు చెందిన 40 మంది ఉపాధ్యాయులకు ఎన్ఐఏ సమన్లు పంపింది.
ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారికంగా బదిలీ చేసుకుంది. పౌరు హత్యలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఎన్ఐఏలోని(NIA news india) ఉగ్రవాద నిరోధక విభాగం అధిపతి తపన్ దేకాతో సహా ఐబీ ఉన్నతాధికారులు శ్రీనగర్‌లో దర్యాప్తు చేస్తున్నారు.
400 మంది అనుమానితుల అరెస్ట్..
ఈ హత్యలకు సంబంధించి.. వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల ఆధారంగా 400 మందిని జమ్ముకశ్మీర్ పోలీసులు అనుమానితులుగా అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారందరికీ.. జమాత్-ఎ-ఇస్లామి, తెహ్రీక్-ఎ-హురియత్ సహా పలు ఉగ్రసంస్థలకు చెందిన వ్యక్తులతో సంబంధాలున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి.
"ఉగ్రవాదులు కాకుండా సాధారణ పౌరులు చనిపోతే వారికి త్వరగా న్యాయం చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
16 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు
వాయిస్ ఆఫ్ హిందూ మ్యాగజైన్, జమ్ములోని బత్నాది ప్రాంతంలో జరిగిన ఐఈడీ పేలుళ్ల కేసులకు సంబంధించి.. జమ్ముకశ్మీర్‌లో పలు చోట్ల అకస్మిక తనిఖీలు చేపట్టింది ఎన్ఐఏ(NIA news india). అనంతనాగ్, శ్రీనగర్, బారముల్లా, కుల్గాం సహా 16 ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో పలువురిని ప్రశ్నించిన అధికారులు.. వారి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
2017లోనూ.. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, ముష్కరులతో సంబంధాల కేసుల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టిన ఎన్ఐఏ(NIA news india).. పలువురిని అరెస్ట్ చేసింది.
570 మంది నిర్బంధం!
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇటీవల ఆరు రోజుల వ్యవధిలో ఏడుగురు పౌరులను బలిగొన్నారు. కొందిరినే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని స్థానికంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లోయలో సంఘ విద్రోహ కార్యకలాపాల కట్టడికి భద్రతా దళాలు భారీ ఎత్తున తనిఖీలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌లో దాదాపు 70 మంది యువకులను అదుపులోకి తీసుకున్నాయి. కశ్మీర్‌వ్యాప్తంగా మొత్తం 570 మందిని నిర్బంధించినట్లు సమాచారం.
ఇదీ చూడండి: Lakhimpur Violence: ఆశిష్ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ