India corona new variant: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్(South africa covid variant) బయటపడిన తరుణంలో భారత్‌లో ఈ వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్‌పై అధికారిక వర్గాలు శుక్రవారం కీలక ప్రకటన చేశాయి. మన దేశంలో కరోనా కొత్త వేరియంట్‌కు(బి.1.1.529) సంబంధించి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పాయి. ఈ వేరియంట్ వ్యాప్తి గురించి భయాందోళనలు వీడి, కరోనా నిబంధనలను ప్రజలంతా తప్పక పాటించాలని సూచించాయి.
రాష్ట్రాలకు హెచ్చరికలు
కొత్త వేరియంట్(Corona new variant) నేపథ్యంలో.. దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోత్స్వానా నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం గురువారం హెచ్చరించింది. కొత్త వేరియంట్ ప్రజారోగ్యానికి సవాలు విసిరే ప్రమాదం ఉందని పేర్కొంది. అందువల్ల ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ ముప్పు ఉన్నవారిగానే పరిగణించి వారికి కఠినమైన స్క్రీనింగ్ జరిపి, పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం పంపాలని సూచించారు.
ఆ దేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు
దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా వివిధ దేశాలు మళ్లీ అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు(New variant travel ban) విధించేందుకు సిద్ధమవుతున్నాయి.
- బ్రిటన్ ఇప్పటికే దక్షిణాఫ్రికాను(South africa travel ban) 'రెడ్ లిస్ట్'లో ఉంచింది. ఆ దేశం నుంచి రాకపోకలపై నిషేధం విధించింది. దక్షిణాఫ్రికాతోపాటు ఇతర ఆఫ్రికా దేశాల ప్రయాణాలపైనా బ్రిటన్ నిషేధం విధించింది.
- ఇదే తరహాలో ఇజ్రాయెల్ కూడా దక్షిణాఫ్రికా ప్రయాణాలపై నిషేధం విధించింది. ఈ కొత్త వేరియంట్ ఉద్ధృతి నేపథ్యంలో ఐరోపా సమాఖ్య, జర్మనీ కూడా దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను నిషేధించాలని యోచిస్తున్నాయి.
- దక్షిణాఫ్రికా నుంచి వచ్చే పర్యటకులపై నిషేధం విధిస్తున్నట్లు ఇటలీ ప్రకటించింది.
- దక్షిణాఫ్రికా సహా ఏడు ఆఫ్రికా దేశాల్లో ఇటీవల పర్యటించిన వారిని తమ దేశంలోకి అనుమతించబోమని సింగపూర్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ దేశాల నుంచి ఇప్పటికే సింగపూర్‌కు వచ్చినవారు... పదిరోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది.
- దక్షిణాఫ్రికా నుంచి వచ్చే అన్ని విమానాలను 48 గంటలపాటు నిషేధిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఒలివర్ వేరన్ విలేకరుల సమావేశంలో శుక్రవారం వెల్లడించారు.
ఇతర దేశాల్లో విస్తరిస్తోందా?
దక్షిణాఫ్రికాలో తొలిసారి బయటపడ్డ ఈ కొత్త రకం వేరియంట్.. ఇతర దేశాలకూ విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో ఒకరికి కొత్త వేరియంట్(israel new covid variant) సోకిందని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మాల్వాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఈ వేరియంట్ వెలుగు చూసిందని చెప్పింది. మరో ఇద్దరిలో ఈ వేరియంట్ సోకినట్లు అనుమానిస్తుండగా.. వారిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు చెప్పింది.
కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూసిన తరుణంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము అత్యవసర పరిస్థితికి అతి దగ్గర్లో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: covid new variant: కరోనా కొత్త వేరియంట్.. డెల్టా కంటే ప్రమాదకరమా?
ఇదీ చూడండి: అక్కడ 11% పెరిగిన కరోనా కేసులు: డబ్ల్యూహెచ్ఓ