Girl Murder 3 Houses Burnt: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో దారుణం జరిగింది. 20 ఏళ్ల యువతిని ఆకతాయిలు గుంపుగా వచ్చి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మూడు ఇళ్లకు నిప్పుపెట్టారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బలగాలు దర్యాప్తు చేపడుతున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని ఇగత్పుర్ తాలుకా అదర్వాడ్లోని కట్కరీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ 20 ఏళ్ల యువతిని.. గుంపుగా వచ్చిన 15 నుంచి 20 మంది దుండగులు హత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో ఉన్న మూడు ఇళ్లకు నిప్పుపెట్టి దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. దాడికి పాల్పడ్డవారు గిరిజన తెగకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. భూవివాదాల కారణంగానే నిందితులు ఇలా చేసినట్లు ప్రాథమిక సమాచారం.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శరద్ మహదు వాఘ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి అదర్వాడ్లో నివసిస్తున్నాడు. అతడికి కొన్నేళ్లుగా బార్షింగ్వే గిరిజన ప్రజలతో భూవివాదం ఉంది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం బార్షింగ్వే ప్రాంతానికి చెందిన 40-50 మంది ప్రజలు.. కర్రలు పట్టుకుని గుంపుగా శరద్ ఇంటిపైపు వచ్చారు. అయితే స్థానికులు మధ్యవర్తిత్వం వహించి గుంపును చెదరగొట్టారు. శనివారం తెల్లవారుజామున మరోసారి 15-20 మంది గుంపుగా వచ్చారు. శరద్ మహదు వాఘ్పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అతడి కోడలు లక్ష్మి(20) అడ్డు వచ్చింది. దీంతో ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత శరద్ మహదు వాఘ్, శంకర్ జ్ఞానేశ్వర్ వాఘ్, అల్కాసంజు వాఘ్లకు సంబంధించిన మూడు ఇళ్లకు నిప్పుపెట్టారు.
ఇవీ చదవండి: ఆయిల్ ట్యాంకర్లో పేలుడు.. 8 మంది సజీవదహనం!