Naranayanpet Road Accident : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు (తెలుపు, నలుపు) బలంగా ఢీ కొట్టుకోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రెండు కార్లలో ఒకటి కర్ణాటక, ఒకటి మహారాష్ట్రకు చెందిందిగా గుర్తించారు. ప్రమాద సమయంలో తెలుపు రంగు కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ కారు హైదరాబాద్ నుంచి రాయచూర్ వైపు వస్తోంది.
అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక మహిళ, ఇద్దరు పురుషులున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరు కర్ణాటక రాష్ట్రం సైదాపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. నలుపు రంగు కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. అందులో ప్రయాణిస్తున్న ప్రబితా, ఆమె 8 ఏళ్ల కుమార్తె మృత్యువాత పడగా భర్త దీపక సమాల్ పరిస్థితి విషమంగా ఉంది. అతను నేవి ఉద్యోగిగా గుర్తించారు. దీపక్ సమాల్ మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అడివేలప్పను హైదరాబాద్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - తెలంగాణ అయ్యప్ప భక్తులు దుర్మరణం
ఊడిపోయిన బస్సు వెనుక టైర్లు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో కరీంనగర్ - వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హుజురాబాద్ నుండి హనుమకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఊడిపోవడంతో చోటు చేసుకున్న ప్రమాదంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉండగా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 55 మంది ప్రయాణించాల్సిన బస్సు 80 మంది ప్రయాణికులతో ఓవర్ లోడ్ తో వెళ్లడమే కారణమని ప్రయాణికులు, స్థానికులు వాపోయారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం, ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం : అలాగే శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపుర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రయ్య(55) అనే వ్యక్తి పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా నేషనల్ హైవే రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో బైక్ ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి కుప్పకూలిపోగా, బైక్ నడిపిన వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు 108 అంబులెన్స్‌లో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రయ్య మృతి చెందగా, మరోవ్యక్తి ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. బైక్ నడిపిన వ్యక్తి కర్ణాటక వాసిగా పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేటు బస్సు ట్రాక్టర్ ఢీకొని నలుగురు మృతి - పరిహారం చెల్లించాలని జాతీయ రహదారిపై ఆందోళన
హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం