Nalanda Covid Vaccination Mistake: దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ మాత్రమే ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. అయితే బిహార్‌లో మాత్రం ఇద్దరు టీనేజ్ సోదరులకు కొవాగ్జిన్‌కు బదులు కొవిషీల్డ్ టీకా ఇచ్చారు వైద్యులు. దీంతో యువకుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. బిహార్‌లోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఏం జరిగిందంటే..?
బిహార్, నలంద జిల్లా ఫ్రొఫెసర్ కాలనీకు చెందిన టీనేజ్ సోదరులు కిషోర్ పియూష్ రంజన్, ఆర్యన్ కిరణ్.. సోమవారం కొవాగ్జిన్ టీకా కోసం కొవిన్ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకున్నారు. ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రంలో వారికి కొవాగ్జిన్‌కు బదులు కొవిషీల్డ్ టీకా ఇచ్చారు సిబ్బంది. ఈ విషయం తెలుసుకుని.. ఇలా ఎందుకు ఇచ్చారని వారు అడగ్గా.. కొవిషీల్డ్ టీకా వల్ల ఎలాంటి ప్రమాదం లేదని టీకా ఇచ్చిన ఆపరేటర్ తెలిపినట్లు ఆ సోదరులు వివరించారు.
హెల్త్ డిపార్ట్మెంట్ అశ్రద్ధగా వ్యవహరిస్తోందని టీనేజ్ సోదరుల తండ్రి ప్రియరంజన్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. యువకులకు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య వస్తే.. ఇంటికి వైద్యులను పంపిస్తామని సంబందిత హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పినట్లు వివరించారు.
సర్టిఫికెట్లో మాత్రం కొవాగ్జిన్..
తమ పిల్లలకు కొవిషీల్డ్ టీకా ఇవ్వగా.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో మాత్రం కొవాగ్జిన్ ఇచ్చినట్లుగా ఉందని టీనేజర్ల తండ్రి ప్రియరంజన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ప్రియరంజన్.
వ్యాక్సిన్ పొరపాటు వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నత వైద్యాధికారులు కిషోర్, కిరణ్‌లకు వ్యాక్సిన్ వేసిన ఆపరేటర్లను విధులనుంచి తొలగించారు. యువకుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సివిల్ సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. సోదరులిద్దరినీ 24గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వివరించారు.
ఇదీ చూడండి: India covid cases: దేశంలో కొత్తగా 37,379 మందికి కరోనా