ఇంట్లోని బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చి శిశువును బకెట్లో విడిచి వెళ్లింది ఓ తల్లి. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి చేరుకొని... బిడ్డను బాత్రూంలో విడిచివచ్చిన విషయాన్ని వైద్యులకు తెలిపింది. దీనిపై డాక్టర్లు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే శిశువు ఉన్న ఇంటికి వెళ్లిన పోలీసులు.. చిన్నారి ప్రాణాలను కాపాడారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ములకుజ ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన ఇంట్లో శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆ చిన్నారిని బాత్రూంలో ఉన్న బకెట్లో విడిచిపెట్టింది. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను గమనించిన ఆసుపత్రి వైద్యులు.. ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో విషయాన్ని మొత్తం డాక్టర్లకు చెప్పింది మహిళ. బిడ్డ చనిపోయిందని భావించి అక్కడ వదిలి వచ్చినట్లు వివరించింది. వెంటనే ఆ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు వైద్యులు.
హుటాహుటిన యువతి ఇంటికి చేరుకున్న పోలీసులు.. బకెట్లో చిన్నారిని గుర్తించారు. శిశువు బతికే ఉండటాన్ని గమనించారు. ఆలస్యం చేయకుండా చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆ చిన్నారి కొట్టాయం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. వైద్యులు శిశువును ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించడం వల్ల.. చిన్నారి ప్రాణాలు నిలిచాయి. దీంతో పోలీసులు చేసిన పనికి ప్రశంసలు అందుతున్నాయి.
ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ పెట్టి.. ఉరివేసుకున్న వ్యక్తి..
మహరాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ పెట్టి.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్ నడిచింది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని కృతంక్ సిద్ధార్థ్ డోంగ్రే(27)గా పోలీసులు గుర్తించారు. అతడు నాగ్‌పుర్‌లోని కాంప్టీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. సిద్ధార్థ్ మద్యానికి బానిస అయ్యాడని పోలీసులు తెలిపారు. అతనికి ఉద్యోగం కూడా లేదని వారు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం సిద్ధార్థ్‌కు.. అతని భార్యతో గొడవ జరిగిందని తెలిపారు. దీంతో ఆమె భర్తను విడిచిపెట్టి వెళ్లిందని పోలీసులు పేర్కొన్నారు.
సోమవారం సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు పనిమీద బయటకు వెళ్లారు. అదే రోజు అర్ధరాత్రి 1.30 గంటల సమయానికి తన మొబైల్లో భార్య ఫేస్బుక్ ఖాతాకు లాగిన్ అయ్యాడు. లైవ్ స్ట్రీమింగ్ పెట్టి.. ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. దీంతో పోలీసులతో సహా.. సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.