Marital rape status in India: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై దిల్లీ హైకోర్టు స్ప్లిట్ వెర్డిక్ట్ ఇచ్చింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా తీర్పులు రాశారు. వ్యాజ్యాలు దాఖలు చేసిన వారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించారు.
ఐపీసీలోని సెక్షన్ 375 ప్రకారం.. మైనర్ కాని భార్యతో భర్త లైంగిక సంభోగం జరపడం నేరం కాదు. అయితే.. ఈ సెక్షన్ రాజ్యాంగబద్ధతను కొందరు సవాలు చేశారు. లైంగికంగా వేధించే భర్తతో కాపురం చేసే మహిళ హక్కుల్ని హరించేలా ఈ సెక్షన్ ఉందని వాదిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై వాదనలు ఆలకించిన దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది. భార్య సమ్మతి లేకుండా లైంగిక సంభోగం చేసే భర్తను నేరస్థుడిగా పరిగణించవచ్చని డివిజన్ బెంచ్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ రాజీవ్ శక్ధేర్ తీర్పు రాశారు. సెక్షన్ 375, 376(E) మినహాయిస్తే.. వైవాహిక అత్యాచారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15,19(1)(A), 21లను ఉల్లంఘించే అంశం అని పేర్కొన్నారు. అయితే.. అదే ధర్మాసనంలో మరో సభ్యుడైన జస్టిస్ హరిశంకర్.. ఇందుకు భిన్నంగా తీర్పు ఇచ్చారు. ఐపీసీలోని సెక్షన్ 375 రాజ్యాంగవిరుద్ధం కాదని.. ఆర్టికల్ 14, 19(1) (A), 21లను ఉల్లంఘించినట్లు కాదని వ్యాఖ్యానించారు.
వైవాహిక అత్యాచారాలపై దాఖలైన వ్యాజ్యాలకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో ఇదే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "వివాహితలు, అవివాహితల గౌరవాన్ని వేర్వేరుగా చూడలేము. పెళ్లయినా.. కాకున్నా.. ఇష్టం లేని లైంగిక చర్యను నిరాకరించే హక్కు ప్రతి మహిళకు ఉంటుంది" అని జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ప్రతి పురుషుడిని రేపిస్ట్ అనడం సరి కాదు: వైవాహిక అత్యాచారంపై ఇదివరకు కూడా పార్లమెంట్లో చర్చ జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చింది. "గృహ హింస నిర్వచనాన్ని గృహహింస చట్టంలోని సెక్షన్ 3 నుంచి తీసుకుందా? అత్యాచారం నిర్వచనాన్ని ఐపీసీ సెక్షన్ 375 నుంచి తీసుకుందా? లేదా?" అని ప్రశ్నలు సంధించారు ఎంపీ బినోయ్ విశ్వమ్. దీనిపై స్పందించిన కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. దేశంలోని మహిళలు, చిన్నారులను సంరక్షించడం ప్రాథమిక కర్తవ్యం అని, ప్రతీ వివాహం హింసాత్మకం అని ఖండించలేమన్నారు. ప్రతి పురుషుడిని రేపిస్ట్ అని అనడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
అంతకుముందు.. 2017లో వైవాహిక అత్యాచారంపై దాఖలైన పిటిషన్లను వ్యతిరేకిస్తూ కేంద్రం అఫిడవిట్‌ను సమర్పించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని.. దాని వల్ల వివాహ వ్యవస్థ దెబ్బతినడం సహా పురుషులపై వేధింపులు పెరిగే అవకాశం పెరుగుతుందని పేర్కొంది.