AP CID Sanjay Comments on Margadarsi: అర్థం పర్థం లేని వాదనలతో మార్గదర్శిపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా, పనిగట్టుకొని హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్‌ని.. వివరణ అడగడం మొదలుపెట్టగానే ఆయన పలాయనం చిత్తగించారు. ఏపీ ప్రభుత్వాధినేతల వైఖరే సీఐడీ వైఖరి అన్నట్లుగా పరిధికి మించిన వ్యాఖ్యలు, పొంతనలేని వివరణలు, అసంబద్ధమైన పోలికలతో తిమ్మిని బమ్మిని చేసేందుకు ప్రయత్నించారు. విలేకర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక అకస్మాత్తుగా ఆయన దుకాణం సర్దేయడం మార్గదర్శి విషయంలో ఆది నుంచీ ఏపీ అధికారులు అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి దర్పణం పట్టింది.
ఐపీఎస్ మాట్లాడే తీరు అదేనా?: తానొక అధికారినన్న సంగతి మరచి మాట్లాడటం మొదలుపెట్టిన ఈ సీనియర్ ఐపీఎస్... ఒక దశలో ‘మార్గదర్శిని మూసేయిస్తాం’ అంటూ దురుసుతనం ప్రదర్శించి, ‘పెద్దమనిషి పెద్దపెద్ద పనులు చేశారు’ అంటూ రాజకీయ నాయకులను మించి వ్యాఖ్యానించి... తాము ఎవరి కోసం పనిచేస్తున్నామో చెప్పకనే చెప్పారు. త్వరలోనే ఏపీలోని 9 బ్రాంచిలకు చెందిన 23 చిట్‌గ్రూపులను నిలిపివేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులిస్తుందనీ సెలవిచ్చారు. మిగిలిన చిట్‌గ్రూపులపైనా ఆడిటింగ్ చేయిస్తున్నామని అన్నారు. 1982లోనే చిట్‌ఫండ్ చట్టం వస్తే 2008 వరకూ నియమావళి రూపొందించలేకపోవడానికి రామోజీరావు పలుకుబడే కారణమని చిట్‌ఫండ్ చట్టం గురించి ఏమీ తెలియకుండా సంజయ్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
చిట్‌ఫండ్ చట్టం ఎప్పటిదో తెలియదా?: అసలు చిట్‌ఫండ్ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చిందన్న కనీస అవగాహన కూడా లేకుండా పొంతన లేని వివరణ ఇస్తూ మార్గదర్శి మీద ఆరోపణలు గుప్పించారు. 1971లోనే చట్టం అమలులోకి వచ్చిందన్న విషయం, 2008 వరకూ అదే అమలులో ఉందన్న కనీస స్పృహ లేకుండా సంజయ్ మాట్లాడారు. నిజానికి 1971 నాటి ఆంధ్రప్రదేశ్ చిట్‌ఫండ్ చట్టం 2008 వరకూ అమలులో ఉంది. ఆ తర్వాత 1982 నాటి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ విషయం తెలియని ఆయన... తన స్థాయి మరచి ఆరోపణలు చేశారు.
ఇలా ఏమాత్రం పసలేని వాదనలకు చట్టం అనే ముసుగు తొడిగి.. అబద్ధాలనే నిజాలుగా నమ్మించేందుకు అష్టకష్టాలు పడి.. చివరకు అర్ధాంతరంగా వెళ్లిపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘బురద జల్లు... బెదిరించు... ప్రశ్నిస్తే పారిపో’ విధానానికి అనుగుణంగానే అదనపు డీజీ ప్రహసనం సాగింది. అత్యాచార బాధితులు ఫిర్యాదు చేయనంత మాత్రాన నేరం జరిగినట్లు కాదా! అంటూ కొత్త తర్కం తెరపైకి తెచ్చారు. 60ఏళ్ల మార్గదర్శి చెల్లింపుల్లో ఎప్పుడూ ఒక్క రూపాయి తేడా ఉన్నట్లు నోటిమాటగా కూడా ఖాతాదారులు ఎవరూ ఆరోపించకపోయినా అత్యాచారం లాంటి దారుణమైన నేరంతో ముడిపెట్టి మకిలి అంటించే ప్రయత్నం చేశారు. ఆయనే ఒకదశలో మార్గదర్శి ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూనే ఉందని అంగీకరిస్తూ మళ్లీ ఉల్లంఘనలు ఉన్నాయంటూ బుకాయించారు.
పత్రికల్లో రాయడమేంటి?: మార్గదర్శి కేసులో దర్యాప్తు సవ్యంగా లేదని భావిస్తే తెల్లకాగితంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి గానీ పత్రికల్లో రాయడం ఏంటని సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తుంటే పత్రికల్లో రకరకాల కథనాలు రాస్తున్నారంటూ.. ఇది తమపై కక్షసాధింపు చర్యేనని చెప్పుకొచ్చారు. పత్రికల్లో ఏ వార్తా కథనాలు రాయాలో, ఏవి రాయకూడదో కూడా తానే నిర్దేశించేలా ఆయన మాటలు ఉన్నాయి.
ప్రభుత్వంలో అధికారిగా ఉంటూ.. కోర్టులో విచారణలో ఉన్న కేసు గురించి మాట్లాడటమే కాకుండా, చిట్ గ్రూపులు మూయించేస్తాం, సంస్థను, నాలుగు రాష్ట్రాల్లో శాఖలను మూసేయిస్తామంటూ సీఐడీ అదనపు డీజీ సంజయ్ బాధ్యతారహితంగా వ్యాఖ్యానాలు చేయడం కోర్టు ధిక్కరణే అవుతుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండే ఐపీఎస్ అధికారులు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అత్యాచార కేసుల్లో సంవత్సరాల తరబడి ఆగి.. అమ్మాయి మేజర్ అయ్యి స్టేషన్‌కు వచ్చేవరకూ ఆగలేం కదా అన్న వ్యాఖ్యలతో చందాదారులకు మైనర్ బాలికలతో అసహ్యకరంగా పోలిక పెట్టారు.
నిజానికి చందాదారులకు ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉండటం వల్లే.. వారెవ్వరూ ఈ 60 ఏళ్లుగా ఫిర్యాదు చేయలేదు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కనపడని నేరం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు కనిపించింది? ఇన్నేళ్ల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవ్వరికీ కనిపించని తప్పులు, దేశ ప్రధానులకు, సీఐడీ, సీబీఐ అధికారులకు కనిపించని తప్పులు జగన్‌కు, అక్కడి సీఐడీకి మాత్రమే కనిపిస్తున్నాయి.
మాటిమాటికీ చీటీలు: ఒక పక్క సంజయ్ విలేకర్ల సమావేశంలో తన వాదన వినిపిస్తుండగా.. మరో పక్క మాటిమాటికీ ఓ ఉద్యోగి ద్వారా పక్క గది నుంచి ఎవరో చీటీలు పంపిస్తున్నారు. ఈ చీటీలను చూసుకుంటూ తన ఆరోపణల పర్వాన్ని సంజయ్ కొనసాగించారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన విలేకర్ల సమావేశంలో పాల్గొనగా అంతసేపూ చీటీల పర్వం కొనసాగింది.
ఇవీ చదవండి: