ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. హిమపాతంలో చిక్కుకొని 10 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందిని సహాయ సిబ్బంది కాపాడారు. హిమపాతంలో చిక్కుకున్న మరో 23 మంది కోసం గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ద్రౌపది దండా-2.. పర్వత శిఖరంపై ఈ ప్రమాదం జరిగింది.
బాధితులంతా.. నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్(ఎన్ఐఎమ్)కు చెందిన వారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎన్ఐఎమ్ ప్రిన్సిపల్ కల్నల్ అమిత్ బిష్ట్.. 34 మంది ట్రైనీలు, 7 బోధకులు పర్వతారోహణకు వెళ్లినట్లు చెప్పారు. వారు శిఖరం పైనుంచి తిరిగి వస్తుండగా.. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు హిమపాతం సంభవించినట్లు తెలిపారు. హిమపాతం కింద చిక్కుకున్న వారిలో 8మందిని గుర్తించి తమ బృందం రక్షించినట్లు ఉత్తరకాశీ విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ తెలిపారు.
భూమికి 14వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకులు ప్రమాదానికి గురికాగా.. మిగిలిన వారి కోసం ఆర్మీ హెలికాఫ్టర్లతో గాలిస్తున్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ తెలిపారు. సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలు పాల్గొన్నట్లు.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.
ఇవీ చదవండి: ఆ వర్గాలకు ఎస్టీ హోదా.. త్వరలోనే రిజర్వేషన్.. అమిత్ షా గుడ్న్యూస్
ఉచిత హామీలపై ఈసీ ఆందోళన.. రాజకీయ పార్టీలకు లేఖ.. ఆ వివరాలు చెప్పాలని ఆదేశం!