భార్యపై అనుమానంతో ఆరేళ్ల కుమారుడిని అతి దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. షూ లేస్తో ఉరేసి చంపాడు. అనంతరం కుమారుడు మృతదేహాన్ని చెరకు తోటలో పడేశాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లుగా కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఓ గ్రామంలో ధర్మేష్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించిన ధర్మేష్.. నిత్యం ఆమెతో గొడవ పడేవాడు. కుమారుడిని క్రూరంగా కొట్టేవాడు. జనవరి 5న కుమారుడిని చంపి చెరకు తోటలో పడేశాడు. మరుసటి రోజు కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ చేసి.. ధర్మేష్యే తన కుమారుడిని హత్య చేసినట్లుగా తేల్చారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని జైలుకు తీసుకెళ్లారు.
మహిళ పేషెంట్‌పై వేధింపులు..
ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో ఓ మహిళ వేధింపులకు గురైంది. బంగాల్లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో ఈ ఘటన జరిగింది. పేషెంట్‌కు మత్తుమందు ఇచ్చి ఆమె శరీర భాగాలను డాక్టర్ తాకాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల కథనం ప్రకారం.. కోల్‌కతాలోని ఫూల్‌బగన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. సర్జరీ కోసం వచ్చిన ఓ 31 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో వేధింపులు ఎదుర్కొంది. ఘటనపై మొదటగా ఆసుపత్రి వర్గాలకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆస్పత్రి సిబ్బందిని, డాక్టర్లను విచారించారు. ఇంకా నిందితుడిని పట్టుకోలేదని పోలీసులు తెలిపారు. ఆస్పత్రి సీసీటీవీ కెమెరాను స్వాధీనం చేసుకుని పరీశీలిస్తున్నట్లు వారు వెల్లడించారు.
చిరుత పులిని చంపిన రైతులు..
రాజస్థాన్‌లో పొలంలో పని చేస్తున్న రైతులపై దాడి చేసిందనే కారణంతో చిరుతను కట్టెలతో కొట్టి హత్య చేశారు. ఈ ఘటన బన్స్వారా జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అంబపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దేవ్ ధరమ్ గ్రామానికి చెందిన దిలీప్(22) అతడి తండ్రి చిరుత దాడిలో గాయపడ్డారు. శుక్రవారం తండ్రీకొడుకులు పొలంలో పనులు చేస్తుండగా చిరుత దాడి చేసింది. దీంతో ఆగ్రహం పెంచుకున్న రైతులు చిరుతను వెతికి పట్టుకుని చంపేశారు. కాగా ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. చిరుతకు శవపరీక్షలు నిర్వహించి ఖననం చేశారు. చిరుత దాడిలో తీవ్రంగా గాయపడ్డ.. దిలీప్, అతని తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మందుల కోసం వెళ్లి మెడికల్ షాప్ వద్దే మృతి చెందిన యువకుడు..
అనారోగ్యంతో ఉన్న ఓ యువకుడు.. మందుల కోసం మెడికల్ షాప్ వెళ్లి వద్దే మృతి చెందాడు. హరియాణాలో ఈ ఘటన జరిగింది. మందులు కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తున్న సమయంలోనే యువకుడు కుప్పకూలాడు. జనవరి 4న ఫరీదాబాద్‌లో ఈ విషాదం జరిగింది. ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు షాప్‌లో ఉన్న వ్యక్తి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించి శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.