తనకు పెళ్లి చేయాలంటూ హరియాణా కర్నాల్‌లో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి నానా వీరంగం చేశాడు. వివాహం చేస్తానని మాట ఇవ్వకపోతే కిందకు దూకి చచ్చిపోతానని ఇంట్లో వారిని బెదిరించాడు. ఈ డ్రామా సుమారు రెండు గంటల పాటు నడిచింది. దీంతో స్థానికులు గుమిగూడారు. యువకుడిని కిందకు దించే ప్రయత్నం చేశారు. అందుకు అతడు ససేమీరా అన్నాడు. చివరకు యువకుడు కోరినట్లు పెళ్లి చేస్తానని కుటుంబసభ్యులు హామీ ఇచ్చారు.
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పైన ఉన్న వ్యక్తిని స్నేహితుల సాయంతో కిందకు దించారు.
మద్యం మత్తులో రచ్చ..
గత శుక్రవారం కూడా టవర్ ఎక్కడానికి ఆ యువకుడు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుడు యువకుడి స్నేహితులు అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. తన కొడుకు మద్యానికి బానిసై టవర్ ఎక్కినట్లు తల్లి తెలిపారు. రోజూ తాగి వచ్చి తనతో గొడవ పెట్టుకుంటాడని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసై.. ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మేసినట్లు చెప్పుకొచ్చారు. ఏ పని చేయకుండా నిత్యం మద్యం సేవించే వాడికి ఎలా పెళ్లి చేయాలని ఆమె వాపోయారు.
ఇదీ చూడండి: ఎద్దు ధర రూ.కోటి.. గొర్రె విలువ రూ.10లక్షలు.. ప్రత్యేకతలు ఇవే...