Lucknow Fire Accident : ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. లఖ్‌నవూలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని లెవానా హోటల్‌లో తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. హోటల్‌లో మరికొంతమంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదం జరగ్గానే హోటల్‌లోని గ్యాస్ సిలిండర్లు, పేలుడుకు ఆస్కారం ఉన్నవాటిని వెంటనే అధికారులు బయటికి తీసుకువచ్చారు. హోటల్ మెుత్తం దట్టమైన పొగ అలుముకోవడం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలిగినట్లు అధికారులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్... గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఘటనపై ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం: జమ్ముకశ్మీర్‌లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. డోడా జిల్లాలో ఆరు గంటల వ్యవధిలోనే రెండు కార్లు లోయలో పడిపోయాయి. ఉదయం 6:30 గంటల సమయంలో గల్గంధర్ సమీపంలో ఓ కారు 400 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను శివ గ్రామానికి చెందిన నసీబ్ సింగ్(62), అతడి భార్య సత్య దేవి(58), కుమారుడు విక్రమ్ సింగ్(22), లేఖ్ రాజ్(63), అతడి భార్య సతీశా దేవిగా (60) గుర్తించారు.
అంతకుముందు జరిగిన మరో ప్రమాదంలో ఓ కారు 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం మొఘల్ మార్కెట్ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సజాద్ అహ్మద్(38), రవీందర్ కుమార్(33) మృతదేహాలను వెలికితీసి.. శవపరీక్ష నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదాలపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర విచారం వ్యక్తం చేశారు
ఇవీ చదవండి: విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్.. సభ నుంచి భాజపా వాకౌట్
గణేశ్ నిమజ్జనంలో మత సామరస్యం.. ముస్లిం అంత్యక్రియల కోసం ఏం చేశారంటే?