బిహార్ మల్ఖానా జిల్లాలోని అర్రా నగరంలో ఓ వింత సంఘటన జరిగింది. 27 ఏళ్లుగా జైల్లో బంధీగా ఉంచిన హనుమంతుడి విగ్రహాన్ని ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో విడుదల చేశారు పోలీసులు. ఇందుకోసం రూ.42 లక్షల పూచికత్తును కూడా చెల్లించాడు ఓ భక్తుడు. హనుమంతుడి విడుదలతో అక్కడి గ్రామస్థుల్లో ఆనందం ఒక్కసారిగా వెల్లివిరిసింది. విగ్రహాన్ని జైలు నుంచి విడుదల చేసేందుకు రూ. 42 లక్షలు డిపాజిట్ చేయాలని అర్రా సివిల్ కోర్టు జడ్జి సతేంద్ర సింగ్ పేర్కొన్నారు. దీనికి అంగీకరించిన ఓ భక్తుడు ఆ మొత్తాన్ని చెల్లించి విగ్రహానికి జైలు నుంచి విముక్తి కల్పించాడు. దీంతో హనుమాన్జీ విడుదలకి సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం న్యాయమూర్తి జారీ చేశారు.
మల్ఖానా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చిన హనుమంతుడి విగ్రహానికి శుద్ధ గంగాజలంతో అభిషేకం చేయించారు అర్చకులు. అనంతరం విగ్రహానికి కొత్త బట్టలు ధరించి పోలీస్ స్టేషన్‌లో ఉన్న విగ్రహాన్ని ఆలయ పూజారికి అప్పగించారు పోలీసులు. ఆ తరువాత హనుమంతుడిని అక్కడి నుంచి మంగళవాయిద్యాలతో సంకీర్తనలు పాడుతూ ఊరేగింపుగా గుండి గ్రామంలోని పురాతనమైన శ్రీరంగనాథ్ ఆలయానికి తీసుకువెళ్లారు గ్రామస్థులు. ఇప్పటివరకు గుండి గ్రామంలోని శ్రీరంగనాథుని ఆలయంలో రెండు విగ్రహాలను పున:ప్రతిష్టించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
1840 నాటి ఆలయ విగ్రహాలు..
భోజ్‌పుర్ జిల్లాలోని గుండి గ్రామంలో చారిత్రక శ్రీరంగనాథుని ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 1840లో బాబు విష్ణుదేవ్ నారాయణ్ సింగ్ అనే వ్యక్తి నిర్మించారు. ఈ గుడిలో శ్రీరంగనాథ్ స్వామితో పాటు అనేక విగ్రహాలను ప్రతిష్టించారు. దాదాపు 29 ఏళ్ల క్రితం 1994 మే 29న ఆలయంలోని హనుమాన్, రామానుజ స్వామి విగ్రహాలు అపహరణకు గురయ్యాయి. దీనిపై అప్పటి ఆలయ పూజారి జనేశ్వర్ ద్వివేది విగ్రహం చోరీకి గురైందని ఆరోపిస్తూ కృష్ణగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. 1996 మే 25న చొంచబాగ్ అనే ప్రాంతంలోని ఓ బావిలో రెండు విగ్రహాలు లభ్యమయ్యాయని సమాచారం అందుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి భద్రపరిచారు.
ఈ కేసుపై సుదీర్ఘ విచారణ చేపట్టింది స్థానిక కోర్టు. చోరీకి గురైన విగ్రహాల ఖరీదు రూ.42 లక్షలు కావడం వల్ల అంత మొత్తాన్ని డిపాజిట్‌గా చెల్లించి విగ్రహాలను తీసుకెళ్లాలని ఆలయ నిర్వాహకులను ఆదేశించింది. కానీ, ఇందుకు ఎవరూ మందుకు రాకపోవడం వల్ల అపహరణ విగ్రహాలను మల్ఖానా పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచారు. అయితే కొద్ది రోజుల తర్వాత విగ్రహాల భద్రత విషయంలో మల్ఖానా పోలీసులు సరైన హామీ ఇవ్వకపోవడం వల్ల అప్పటి నుంచి వీటిని కృష్ణగఢ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి భద్రపరిచారు అధికారులు.
ఈ క్రమంలో మహావీర్ మందిర్ న్యాస్ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. విగ్రహాల విముక్తికి అవసరమైన పూచికత్తు మొత్తాన్ని కోర్టులో చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం ఏడాది క్రితమే రూ.42 లక్షలను న్యాయస్థానంలో డిపాజిట్ చేశారు. దీంతో కృష్ణగఢ్ పోలీస్ స్టేషన్‌లోని ఓ గదిలో తాళం వేసి ఉన్న విగ్రహాలకు విముక్తి కల్పించారు కిషోర్. శ్రీరామనవమి నేపథ్యంలో విగ్రహాలు విడుదల అవ్వడం వల్ల గుండి గ్రామ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. విగ్రహాల ఊరేగింపు పూర్తయిన తర్వాత వాటికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ పూజారులు.