దేశంలో స్వతంత్ర పోస్టాఫీస్ కలిగిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు భారత రాష్ట్రపతి కాగా.. మరొకరు శబరిమల అయ్యప్ప స్వామి. కేరళ పతనమ్‌తిట్ట పరిధిలోని శబరిమల సన్నిధానంలో ఉన్న పోస్టాఫీస్ ఎంతో ప్రత్యేకం. ఈ తపాలా కార్యాలయం మండల దీక్షల సమయంలోనే.. అంటే సంవత్సరంలో 3 నెలలు మాత్రమే సేవలు అందిస్తుంది. దేశంలో ఇలా మూడు నెలలు మాత్రమే పనిచేసే ఏకైక తపాలా కార్యాలయం ఇదే.
ఎన్నో ప్రత్యేకతలను కలిగిన ఈ పోస్టాఫీస్‌కు సొంత పోస్టల్ సీల్, పిన్‌కోడ్ ఉన్నాయి. ఇతర పోస్ట్ ఆఫీస్‌లతో పోలిస్తే ఇక్కడ ఉండే పోస్టల్ సీల్ సైతం విభిన్నంగా ఉంటుంది. సీల్‌పై అయ్యప్ప చిత్రాలు, 18 బంగారపు మెట్ల గుర్తులు ఉంటాయి. మండల దీక్షలు ముగిశాక ఈ సీల్‌ను పోస్టల్ సూపరిండెంట్ కార్యాలయంలో భద్రపరుస్తారు. అయ్యప్ప చిత్రంతో కూడిన స్టాంప్‌లను సైతం ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ తపాలా కార్యాలయం 1963లో ప్రజలకు అందుబాటులోకి రాగా.. 1975 నుంచి అయ్యప్పస్వామి చిత్రంతో ఉన్న తపాలా బిళ్లలను ముద్రిస్తున్నారు.
అయ్యప్ప దర్శనానికి వచ్చిన ఎంతో మంది భక్తులు ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి తమ కుటుంబ సభ్యులకు కార్డులను పంపిస్తారు. వివాహ ఆహ్వానాలు, గృహప్రవేశ ఆహ్వానాలు ఇలా ఎన్నో శుభకార్యాల ఆహ్వాన పత్రికలను సైతం భక్తులు అయ్యప్పకు పంపిస్తారు. వీటన్నింటినీ చదవడానికి సంవత్సరాల సమయం పడుతుందని చెబుతున్నారు అధికారులు. అలాగే ఈ కార్యాలయానికి అయ్యప్ప పేరిట మనియార్డర్లు వస్తుంటాయి. వీటన్నింటినీ దేవస్థానం కార్యనిర్వాహక అధికారి కార్యాలయానికి అందజేస్తారు.
ఈ తపాలా కార్యాలయంలో ఉద్యోగుల జీతాల పంపిణీ, మొబైల్ రీఛార్జ్ సేవలు కూడా అందిస్తారు. ప్రజలు కోరుకున్న విధంగా వారి సొంత చిత్రంతో తపాలా బిళ్లను కూడా ముద్రించి ఇస్తారు. వీటిలో శబరిమల చిత్రం కూడా ఉంటుంది. ఈ కార్యాలయంలో పోస్ట్‌మాస్టర్, ఇద్దరు పోస్ట్‌మెన్, ముగ్గురు గ్రూప్-డీ ఉద్యోగులు సహా మరో ఆరుగురు సిబ్బంది ఉంటారు.
అయ్యప్ప దర్శనానికి రాలేని భక్తుల కోసం శబరిమల తపాలా కార్యాలయం ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ నుంచైనా నగదు పంపిస్తే ప్రసాదాన్ని పంపేలా ఏర్పాట్లు చేసింది. మండల దీక్షలు ముగిసిన అనంతరం పోస్ట్ ఆఫీస్‌ను మూసివేసేటప్పుడు మిగిలిన అయ్యప్ప చిత్రాలను భద్రంగా ఉంచుతారు.
ఇవీ చదవండి: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై విమానాల్లోనూ ఇరుముడి
తెరుచుకున్న శబరిమల ఆలయం.. 41రోజుల పాటు మండల పూజ.. భారీగా భక్తుల తాకిడి!