Bihar CM news: బిహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరైన ఓ సభలో భద్రతా వైఫల్యం జరిగింది. ఆయన ఉన్న స్టేజీకి అతి సమీపంలో ఓ వ్యక్తి బాణాసంచా కాల్చడం గందరగోళానికి దారి తీసింది. ఆ శబ్దం విని ప్రజలు పరుగులు తీయడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే స్టేజీ దగ్గర బాణసంచా పేల్చిన వ్యక్తికి మతిస్తిమితం సరిగ్గా లేనట్లు తెలుస్తోంది. అధికారులు వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మొదట పేలుడు శబ్దం విని బాంబు అనుకుని ప్రజలు భయపడ్డారని, ఆ తర్వాత పరిస్థితిని అదుపు చేసినట్లు చెప్పారు. నలందలోని సీఎం హాజరైన సభలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. బాణసంచాను కాల్చిన వ్యక్తి.. వాటిని స్టేజీకి దగ్గరగా విసిరేయడం వల్లే గందరగోళం నెలకొందని వివరించారు.


