Lakhimpur kheri tigress: ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో మనుషులను చంపి తింటూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ ఆడపులిని అధికారులు బంధించారు. ఇప్పటివరకు 21 మందిని చంపిన ఆ పులిని సోమవారం రాత్రి అటవీ అధికారులు పట్టుకున్నారు. దీంతో స్థానిక ప్రజలకు ఉపశమనం లభించినట్లైంది.
ఇనుప బోనులో పులిని నిర్బంధించినట్లు దుధ్వా ఫీల్డ్ డైరెక్టర్ సంజయ్ పాఠక్ తెలిపారు. కొద్దిరోజుల పాటు పులిని అందులోనే ఉంచనున్నట్లు చెప్పారు. దాని ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. వైద్యులు, వన్యప్రాణి నిపుణుల సంరక్షణలో పులిని ఉంచుతున్నట్లు తెలిపారు. అయితే, ఇన్నాళ్లూ మనుషులను చంపి తిన్న పులి ఇదేనా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
దుధ్వా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో గడిచిన రెండేళ్లుగా పులులు సంచరించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. కొన్నిసార్లు అవి బయటకు వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. రెండేళ్ల వ్యవధిలో 21 మంది పులి దాడుల్లో చనిపోయారు. గడిచిన ఒక్కవారంలోనే ఐదుగురు మరణించారు. దీంతో అధికారులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి స్పందించిన నేపథ్యంలో.. దుధ్వా టైగర్ రిజర్వ్ యంత్రాంగం, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సహకారంతో పులిని బంధించింది. ఈ ప్రాంతంలో రెండు ఆడ పులుల ఆనవాళ్లు కెమెరాల్లో కనిపించాయని అధికారులు తెలిపారు. అందులో ఒకటి చిన్న పులి అని చెప్పారు.
ఇదీ చదవండి: