Lakshmi is practicing yoga at the age of 60: వామ్మో ఏంటీ ఈవిడ శరీరాన్ని విల్లులా ఎలా పడితే అలా తిప్పేస్తూ అత్యంత క్లిష్టమైన యోగాసనాలను అలవోకగా వేస్తూ.. అందర్నీ అబ్బురపరుస్తోంది. బహుశా 40, 45 ఏళ్ల వయసు ఉండి ఉంటుంది అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకుంటే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన లగుడు లక్ష్మీకి 60 ఏళ్లు దాటాయి. ఈ వయసులోనూ యోగ సాధన చేస్తూ అందర్నీ ఆశర్చపరుస్తోంది. అంతేకాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పాతికకు పైగా బంగారు పతకాలు సాధించింది. అంతేకాదు ఎంతోమందికి యోగాను నేర్పిస్తూ.. వారి జీవితాలను సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. జీవనశైలి తప్పిదాలతో ఊబకాయాన్ని మోస్తున్న యువతరంలో.. మార్పు దిశగా స్ఫూర్తి నింపుతోంది.
పతంజలి యోగా శిక్షణ కేంద్రం.. లగుడు లక్ష్మిని ఆమె అనారోగ్య సమస్యే యోగా బాట పట్టించింది. 25 ఏళ్ల క్రితం అనారోగ్యంతో వైద్యుడు వద్దకు వెళితే బాగు చేయలేమని చెప్పారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కుంగిపోకుండా.. యోగాలో ప్రావీణ్యం ఉన్న తన భర్త లగుడు అప్పన్న సహకారం తీసుకొంది. భర్తే గురువుగా యోగాసాధన ప్రారంభించింది. ఆపై అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. శరీరంలో దృఢత్వం, ముఖంలో తేజస్సుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పునర్జన్మనిచ్చిన యోగ విద్యను 10 మందికి పంచాలని ఉద్దేశంతో ఆముదాలవలసలోనే పతంజలి యోగ శిక్షణ కేంద్రాన్ని లక్ష్మి ప్రారంభించింది. మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది.
మిస్ యోగ యూనివర్స్ బిరుదుతో సత్కారం.. యోగా నేర్చుకోవడం నేర్పడమే కాదు పోటీ కూడా పడాలనే ఉద్దేశంతో 2004లో వరంగల్‌కు లగుడు లక్ష్మి వెళ్లింది. అక్కడి పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ ప్రదర్శన ద్వారా జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. కష్టమైన ఆసనాలను సాధన చేస్తూ జాతీయ స్థాయి యోగ క్రీడా పోటీల్లో పాల్గొని 30 పైగా బంగారు పథకాలు సాధించారు. 2013లో దాయిలాండ్లో జరిగిన అంతర్జాతీయ పోటీలో పాల్గొని నాలుగు విభాగాల్లో నాలుగు బంగారు పతకాలు సాధించి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్గా నిలిచారు.
లక్ష్మీ కనపరిచిన ప్రతిభకు థాయిలాండ్ యోగ అసోసియేషన్ మిస్ యోగ యూనివర్స్ బిరుదుతో సత్కరించారు. 2015 చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడ పోటీలు జరిగినా తనదైన శైలిలో కష్టమైన ఆసనాలు కూడా ఎంతో సులభంగా వేస్తూ తన దగ్గర ఉన్న బంగారు పతకాల జాబితాన్ని పెంచుకుంటున్నారు లక్ష్మి, చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి ఎంతోమంది మహిళలకు ఉచితంగా యోగ సాధన నేర్పిస్తూ పలు ఆరోగ్య సూత్రాలు యోగ చైతన్యాన్ని అందరిలోనూ నింపుతున్నారు.
పేద విద్యార్థులకు యోగ సాధన నేర్పిస్తూ.. లక్ష్మి భర్త అప్పన్న జల వనరుల శాఖలో రిటైర్డ్ ఉద్యోగి 75 ఏళ్ల వయసులోనూ భార్యకు యోగాలో మెలుకవలు నేర్పుతూ అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేస్తున్నారు. భార్యతో పాటు చుట్టుపక్కల ఉండే అనేక మంది పేద విద్యార్థులకు యోగ సాధన నేర్పిస్తూ తమ సొంత డబ్బులతోనే యోగ పోటీలకు పంపిస్తున్నారు. చాలా మంది విద్యార్థులు పాఠశాల దశలోనే రాష్ట్రస్థాయిలో బంగారు పథకాలు సాధించడం తమ గర్వంగా ఉంది ఉందంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రతిరోజు ఉదయాన్నే తమ ఇంటి వద్దనే ఎంతోమంది యోగ సాధకులకు శిక్షణ ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇవీ చదంవడి: