Kerala minister constitution: భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేరళ మత్స్యకార, సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్. రాజ్యాంగం దోపిడీని సమర్థిస్తూ, దేశ ప్రజలను మోసం చేసే విధంగా రాశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన ప్రతిపక్షాలు.. మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.
మంత్రి ఏమన్నారు?
మల్లపల్లిలో జరిగిన రాజకీయ కార్యక్రమానికి హాజరైన చెరియన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనమతించదని.. కానీ వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందని మంత్రి విమర్శించారు. ఈ కారణంతోనే దేశంలో కార్పొరేట్ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు. బ్రిటీష్ వారు సంకలనం చేసిన రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని.. దానినే 75 ఏళ్లుగా అమలు చేస్తున్నామన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటివి వాటిలో పొందుపరిచారని చెప్పారు. దేశంలో ఎవరు దీనికి విరుద్ధంగా చెప్పినా తాను అంగీకరించబోనని మంత్రి చెరియన్ స్పష్టం చేశారు.
"మనం రాజ్యాంగాన్ని అద్భుతంగా రచించుకున్నామని చెప్పుకుంటాం. ఇది భారత దేశానికే ప్రత్యేకమైనదని చెబుతాం. కానీ ఈ రాజ్యాంగాన్ని అత్యధిక ప్రజలను దోచుకునే విధంగా రాశారు."
- సాజి చెరియన్, కేరళ మంత్రి
మంత్రి చెరియన్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్, భాజపా తీవ్ర అభ్యంతరం తెలిపాయి. మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన ఆయన దానిని కించపరిచారని ప్రతిపక్ష నేత సతీశన్ అన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ మాట్లాడుతూ.. మంత్రి చెరియన్‌కు ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. కమ్యూనిస్టులు రాజ్యాంగాన్ని గౌరవించరనే విషయం చెరియన్ వ్యాఖ్యలతో మరోసారి రుజువైందని విమర్శించారు.
విచారం వ్యక్తం చేసిన మంత్రి: తాను ప్రజా సేవకుడినని.. రాజ్యాంగాన్ని తానెంతో గౌరవిస్తానని చెప్పారు మంత్రి సాజి చెరియన్. రాజ్యాంగాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే.. మంత్రి సాజి చెరియన్ను బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను అధికార సీపీఎం తోసిపుచ్చింది. పొరపాటున నోరు జారారని వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి: 'నుపుర్'కు మద్దతుగా సీజేఐకి మాజీ జడ్జిల లేఖ.. సుప్రీం వ్యాఖ్యలపై అసంతృప్తి