కృష్ణానదిలో ఈతకు వెళ్లి చనిపోయిన తాత మృతదేహాన్ని వెతకడానికి వెళ్లి.. మరో ముగ్గురు ప్రమాదవశాత్తూ చనిపోయిన ఘటన కర్ణాటకలో బాగల్కోట్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది
హునగుండ తాలూకాలోని హరనాళ గ్రామానికి చెందిన శివప్ప(70).. సమీపంలోని నారాయణ రిజర్వాయర్‌కు ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడు అదృశ్యమయ్యాడు. దీంతో తమ తాతను వెతకడానికి ముగ్గురు మనవళ్లు శరణప్ప(30), యనమప్ప(35), పరసప్ప(30) వెళ్లారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభానికి సమీపంలోకి వెళ్లి.. విద్యుదాఘాతానికి గురయ్యారు. శివప్ప రెండు రోజుల తర్వాత శవమై కనిపించాడు. అయితే మిగిలిన ముగ్గురి మృతదేహాల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
దీంతో స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
ఎమ్మెల్యే విచారం
ఈ విషయంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే ఏఎస్ నాదహళ్లి ఘటనాస్థలాన్ని సందర్శించారు. హరనాల గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారని ధ్రువీకరించిన ఎమ్మెల్యే.. విచారం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఒకరి మృతదేహం లభ్యమైందని.. మిగిలిన మృతదేహాల గాలింపు కోసం బాగల్కోట్ నుంచి ప్రత్యేక బృందం వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Earthquake News: మయన్మార్‌లో భూకంపం- లద్దాఖ్‌లో కంపించిన భూమి