Karnataka Road accident: కర్ణాటకలోని హుబ్బళ్లి శివారు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందగా..మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో సుమారు 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను హుబ్బళ్లిలోని కింబాల్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ సహా బస్సులోని ఏడుగురు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బస్సు మహారాష్ట్రలోని కొల్హాపుర్ నుంచి బెంగళూరు వెళుతున్నట్లుగా గుర్తించారు.
రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి: రాజస్థాన్ కోటాలోని 27 నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి ట్రాక్టర్ ట్రైలర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. 15 మందికి గాయాలయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. మృతులలో ముగ్గురిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించగా.. మరోకరి ఆచూకీ తెలియలేదని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు.
జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు: ఉదయపు నడకకు వెళ్లిన జనాలపైకి ఓ ట్రక్కు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా ఇద్దరు తీవ్ర గాయల పాలయ్యారు. ఈ ప్రమాదం అసోం దర్రాంగ్ జిల్లాలోని సిపఝార్లో మంగళవారం ఉదయం జరిగింది. గాయపడిన వారిని గువాహటి వైద్య కళాశాలకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న నిందితుడిని పట్టుకోలేకపోయారు.
అస్తికలు కలిపేందుకు వెళ్లి వస్తుండగా..: హరియాణాలోని జీంద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిని, అస్తికలు కలిపేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను జీంద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ప్రియుడిని హతమార్చిన భర్త.. మనస్తాపంతో భార్య సూసైడ్!