Karnataka Assembly Election : ప్రధాన పార్టీల అగ్రనాయకుల ప్రచారంతో హోరెత్తి పోయిన కర్ణాటకలో బుధవారం పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కర్ణాటకలో 5 కోట్లకు పైగా అర్హులైన ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 224 అసెంబ్లీ స్థానాల్లో 2,615 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
భద్రత కట్టుదిట్టం
Karnataka election news : పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలాంటి స్టేషన్ల కోసం మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. వెబ్‌క్యాస్టింగ్, సీసీటీవీల ద్వారా పోలింగ్ కేంద్రాలను అధికారులు పర్యవేక్షించనున్నారు.
రికార్డు స్థాయిలో సీజ్
కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 4.5 రెట్లు అధికంగా నగదు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రూ.375కోట్ల లిక్కర్, డ్రగ్స్‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ.288 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 224 సీట్లు ఉండగా.. 81 స్థానాల్లో ప్రలోభాలు అధికంగా ఉన్నట్లు ఈసీ గుర్తించింది.
హైఓల్టేజ్ ప్రచారం
లోక్‌సభ ఎన్నికలకు ముందు జరగనున్న పెద్ద రాష్ట్రాల ఎన్నికల్లో కర్ణాటక కీలకం. అందుకే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎలక్షన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో 38 ఏళ్లుగా వస్తున్న అధికార మార్పిడి సంప్రదాయానికి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రచారం నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ ముందుండి ప్రచారాన్ని నడిపించారు. మార్చి 29న ఎన్నికల ప్రకటన రాగా.. ఆలోపే రాష్ట్రంలో ఏడుసార్లు పర్యటించారు. పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఏప్రిల్ 29 తర్వాత 18 మెగా పబ్లిక్ మీటింగ్‌లు, ఆరు రోడ్‌షోలు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలు సైతం కర్ణాటకలో పర్యటించారు.
అధికార బీజేపీని గద్దెదించాలని భావిస్తున్న కాంగ్రెస్ మాత్రం స్థానిక సమస్యలపైనే ప్రధానంగా దృష్టిసారించింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రస్తావిస్తూ ప్రచారంలో దూకుడు ప్రదర్శించింది. గ్యారంటీల పేరిట ప్రజలపై ఉచితాల హామీలు కురిపించింది. ప్రారంభంలో ప్రచారం సైతం స్థానిక నేతలే భుజానికెత్తుకున్నారు. తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్టీ తరఫున ప్రచారం చేశారు. చివర్లో సోనియా గాంధీ సైతం ఓ బహిరంగ సభ నిర్వహించారు.
రాష్ట్రంలో కింగ్‌మేకర్‌గా నిలవాలని చూస్తున్న జేడీఎస్ సైతం ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు. తనకు పట్టున్న పాత మైసూరు ప్రాంతంతో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ బలంగా ప్రచారం నిర్వహించింది. జేడీఎస్ దిగ్గజం దేవెగౌడ(89) ప్రారంభంలో ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ.. తర్వాత రంగంలోకి దిగారు. పాత మైసూరు ప్రాంతంలో తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఆయన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి.. ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా జేడీఎస్ తరఫున ముందుండి ప్రచారం చేశారు.