Karnataka assembly elections : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 6 వరకు సాగింది. ఆలోపు క్యూలో ఉన్న వారికి ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు 65.69 శాతం ఓటింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంత ప్రజలు ఓటేసేందుకు పోటెత్తగా.. పట్టణ ప్రాంత ప్రజల్లో మాత్రం కాస్త అలసత్వం కనిపించింది. మధ్యాహ్నం 3 గంటల నాటికి రామనగర నియోజకవర్గంలో అత్యధికంగా 63.36 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) దక్షిణంలో అతితక్కువగా 40.28 శాతం ఓటింగ్ నమోదైంది.
తొలిసారి ఓటు వేస్తున్న యువ ఓటర్లు, వృద్ధులు పోలింగ్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్ణాటకలో అర్హులైన యువ ఓటర్ల 11.71లక్షలు కాగా.. 80 ఏళ్లు దాటినవారు 12.16 లక్షల మంది ఉన్నారు. హసన్ జిల్లాలోని హోలెనరసిపుర్ తాలుకాలో వందేళ్ల వయసు ఉన్న వృద్ధురాలు బోరమ్మ.. పోలింగ్ బూత్‌కు నడుచుకుంటూ వచ్చి ఓటేశారు. అందరూ ఓటేయాలని ఆమె పిలుపునిచ్చారు. పలు పోలింగ్ బూత్‌లలో వధూవరులు ఓటువేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ట్రాన్స్జెండర్లు సైతం పెద్ద సంఖ్యలో ఓటేశారని ఈసీ అధికారులు వెల్లడించారు.
అమెరికా నుంచి వచ్చి ఓటు..
బెంగళూరుకు చెందిన మేఘన అనే యువతి అమెరికా నుంచి వచ్చి మరీ ఓటేశారు. దక్షిణ బెంగళూరులో ఉన్న బసవన్నగుడి నియోజకవర్గంలో యువతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు, ఓటేసేందుకు అమెరికా నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాఘవేంద్ర కమాలాకర షేట్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. తన పేరు ఓటర్ లిస్ట్‌లో లేకపోవడం వల్ల రాఘవేంద్ర షాక్‌కు గురయ్యారు. అధికారులను అడిగినప్పటికీ.. ఫలితం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా విజయపుర జిల్లాలో ఉద్రిక్తత తలెత్తింది. ఈవీఎంలు తీసుకెళ్తున్న వాహనాన్ని మాసబినాలా గ్రామ ప్రజలు అడ్డుకొని.. ఎన్నికల సంఘం అధికారులపై దాడి చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను మారుస్తున్నారంటూ ప్రచారం జరగడం వల్ల.. కోపోద్రిక్తులైన గ్రామస్థులు పోలింగ్ కేంద్రం వద్దకు దూసుకెళ్లారు. సరిగ్గా అదే సమయంలో అధికారులు రెండు ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి కారులో పెట్టారు. పోలింగ్ నిలిపివేశారని భావించిన గ్రామస్థులు వారిపై దాడికి దిగారు. కారుతోపాటు ఈవీఎంలపైనా దాడి చేశారు. ఈ ఘటనలో పోలింగ్ సిబ్బంది వాహనాలు, ఈవీఎంలు, వీవీప్యాట్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లను ధ్వంసం చేశారు.
వాహనంలో రిజర్వ్ ఈవీఎంలను తరలిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మాసబినలాలో అదనపు ఈవీఎంల అవసరం లేదని.. అధికారులు వాటిని మరో పోలింగ్ కేంద్రానికి తరలిస్తున్నారని వివరించింది. ఈ విషయాన్ని గ్రామస్థులకు అధికారులు చెప్పినా వారు వినిపించుకోలేదని డిప్యూటీ కమిషనర్ విజయ్‌మహంతేశ్ తెలిపారు. పోలింగ్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే.. ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకొని చర్యలు తీసుకున్నట్లు ఈసీ వివరించింది. 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని ఈసీ తెలిపింది. కోలార్‌లో స్వల్ప ఉద్రిక్తత తలెత్తగా.. బెంగళూరులోని పద్మనాభనగర్‌లో కాంగ్రెస్ శ్రేణులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బళ్లారి జిల్లా సంజీవరాయనకొటేలో కాంగ్రెస్, భాజపా శ్రేణులు ఘర్షణపడ్డారు.
ఓటేసేందుకు వచ్చి మృతి..
హసన్, బెళగావి జిల్లాల్లో ఓటేసేందుకు వచ్చి ఇద్దరు మృతి చెందారు. బెళగావి జిల్లాలోని యరగట్టి ప్రాంతంలో ఓటేసేందుకు వెళ్లిన పారవ్వ ఈశ్వర సిద్నాలా అనే 68 ఏళ్ల వృద్ధురాలు.. బూత్ లోపల కుప్పకూలారు. ఓటేయడానికి ముందే ఆమె కిందపడి మరణించారని అధికారులు వెల్లడించారు. హసన్ జిల్లాలో ఓ వ్యక్తి ఓటేసి తిరిగి వస్తుండగా.. గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడిని 49 ఏళ్ల జయన్నగా గుర్తించారు. బేలూర్ తాలుకాలోని చిక్కోలే గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ కేంద్రం ఆవరణలోనే అతడు గుండెపోటుతో కుప్పకూలాడని అధికారులు తెలిపారు.
పోలింగ్ కేంద్రంలో ప్రసవం..
మరోవైపు, బళ్లారి జిల్లాలో ఓ మహిళా ఓటరు.. పోలింగ్ కేంద్రంలో బిడ్డకు జన్మనిచ్చింది. కోర్లాగుండి గ్రామంలో 228వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు వెళ్లిన మనీలా అనే గర్భిణీకి క్యూలో ఉండగానే నొప్పులు వచ్చాయి. దీంతో అక్కడే ఆమెకు సాధారణ డెలివరీ అయింది. శిశువును, తల్లిని వెంటనే స్థానిక ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. ఇద్దరి ఆరోగ్యం క్షేమంగానే ఉందని వైద్యులు తెలిపారు.