ఉత్తరప్రదేశ్‌లోని హాథరస్‌లో 2020లో సామూహిక అత్యాచారానికి గురై మృతిచెందిన దళిత యువతి ఉదంతాన్ని కవర్ చేసేందుకు వెళుతూ అరెస్టయిన కేరళ పాత్రికేయుడు సిద్ధీఖ్ కప్పన్‌కు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతడికి బెయిల్ మంజూరు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. కప్పన్‌ను మూడు రోజుల్లోపు ట్రయల్ కోర్టులో హాజరుపర్చి.. బెయిల్‌పై విడుదల చేయాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే బెయిల్‌పై విడుదలైన తర్వాత కప్పన్ ఆరువారాల పాటు దిల్లీలోనే ఉండాలని తెలిపింది. తన పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని, ప్రతి సోమవారం పోలీసు స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని జర్నలిస్టును ఆదేశించింది.
2020 సెప్టెంబరు 14న హాథరస్‌లో ఓ దళిత యువతిపై ఆమె గ్రామానికే చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ ఘటన తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన పోలీసులు అర్ధరాత్రి హడావుడిగా దహన సంస్కారాలు చేయడం వివాదాస్పదంగా మారింది. తమ ప్రమేయం లేకుండానే ఆమెకు అంత్యక్రియలు చేశారని, కడసారి చూపు కూడా దక్కలేదని బాధితురాలి తల్లిదండ్రులు వాపోయారు.
దీంతో ఈ ఘటనపై పరిశోధనాత్మక కథనాన్ని కవర్ చేసేందుకు కేరళకు చెందిన సిద్ధీఖ్ కప్పన్ హాథరస్ బయల్దేరగా.. మార్గమధ్యంలో యూపీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం కింద అరెస్టు చేశారు. దీంతో ఆయన బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ ధర్మసనానికి అప్పీలు చేసుకున్నారు. లఖ్‌నవూ బెంచి ఆ దరఖాస్తును కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కప్పన్ అభ్యర్థనపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అయితే కప్పన్ దేశంలో మత విభేదాలను, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే కుట్రలో భాగస్వామి అని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆయనకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా/ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ/సీఎఫ్‌ఐ) నాయకులతో సంబంధాలు ఉన్నాయనీ ఆరోపించింది. ఈ వివరణను పరిశీలించిన ధర్మాసనం.. అతడికి బెయిల్ మంజూరు చేసేందుకు అంగీకరిస్తూ పలు షరతులు విధించింది.