Student Reporting Video: ప్రస్తుత టెక్నాలజీ యుగంలోనూ కొన్ని గ్రామాల్లో కనీస వసతులు లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వసతుల కొరతతో అనేక పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా కొన్నిచోట్ల పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఝార్ఖండ్‌లోని ఓ పాఠశాలలో కూడా పలు సమస్యలు తిష్టవేశాయి. దీంతో విసుగొచ్చిన ఓ విద్యార్థి.. రిపోర్టర్‌గా మరి స్కూల్లో ఉన్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించాడు.

ఝార్ఖండ్.. గొడ్డా జిల్లాలోని మహ్గామా బ్లాక్‌లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొన్నేళ్లుగా అనేక సమస్యలు తిష్టవేశాయి. దీంతో విద్యార్థుల శాతం కూడా తగ్గిపోయింది. దీన్నంతా గమనించిన సర్ఫరాజ్ అనే ఓ 12 ఏళ్ల విద్యార్థి రిపోర్టర్ అవతారం ఎత్తాడు. ఓ ప్లాస్టిక్ బాటిల్‌కు కర్ర తగిలించి మైక్ తరహాలో తయారు చేశాడు. దాన్ని పట్టుకుని సమస్యలను చూపిస్తూ వివరించాడు.

"మా గ్రామంలో పాఠశాల పరిస్థితి గురించి మీకు వివరిస్తా. విద్యార్థులకు కనీసం తాగడానికి నీరు కూడా లేదు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మరుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. తరగతి గదుల్లో పశువుల మేతను పడేస్తున్నారు. ఇక ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులు సక్రమంగా రావడం లేదు".. అంటూ తమ పాఠశాలలోని దుస్థితిని చక్కగా వివరించాడు. పక్కనే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు.. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కామెంట్లు పెట్టి షేర్ చేశారు.

ఇద్దరు టీచర్లు సస్పెండ్..
అయితే సర్ఫరాజ్ రిపోర్టింగ్ వీడియో తెగ వైరల్ కావడం వల్ల జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి రజినీ కుమారి స్పందించారు. వెంటనే పాఠశాలకు సంబంధించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. పాఠశాల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: ఏడేళ్ల వయసులో బాలిక మాయం.. 9 సంవత్సరాల తర్వాత కిడ్నాపర్ దొరికాడిలా..